స్మార్ట్‌ఫోన్లకూ రక్తం మరకలే....

Blood and Ore: Conflict Smartphones - Sakshi

న్యూయార్క్‌ : కాంతులీనుతూ కనువిందుచేసే వజ్రాలకు ఎంతో రక్త చరిత్ర ఉన్న విషయం తెల్సిందే. గునుల కైవసం కోసం జరిగిన ఘర్షణలు, సంఘర్షణల్లో రక్తం ఏరులై పారిందని, నిర్బంధ కార్మికుల స్వేద బిందువుల్లో వజ్రాలు తడిశాయని తెల్సిందే. లియోనార్డో డికాప్రియో నటించిన ‘బ్లడ్‌ డైమండ్‌’ చిత్రం చూసినా తెలిసిపోతుంది. కానీ మనం నిత్యం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కూడా ఇలాంటి రక్త చరిత్రే ఉందన్న విషయం ఎందరికి తెలుసు?

నిత్య సంఘర్షణలతో రక్తం పారుతున్న ప్రదేశాల నుంచి, యుద్ధాలు కొనసాగుతున్న ప్రాంతాల నుంచి, మానవ హక్కులను గుర్తించని దేశాల నుంచి, నిర్బంధ కూలీలు పనిచేస్తున్న గనుల నుంచి ఈ ఎలక్ట్రానిక్‌ వస్తువులను తయారీకి ఉపయోగిస్తున్న ఖనిజాలు వస్తున్నాయి. కెపాసిటర్లు, హైపవర్‌ రెసిస్టర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న టాంటలమ్, ఫిలనమెంట్ల తయారీకి ఉపయోగించే టంగ్‌స్టెన్, ఎలక్ట్రానికి సర్క్యూట్లలో ఉపయోగించే సోల్డర్లు తయారీకి ఉపయోగించే టిన్, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ బోర్డుల్లో ఉపయోగించే గోల్డ్‌ లాంటి ఖనిజాలు రక్త చరిత్ర కలిగిన కాంగో, అంగోలా, రువాండాలతోపాటు వాటి చుట్టుపక్కలున్న ఏడు దేశాల నుంచి వస్తున్నాయి. అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగిస్తున్న రీచార్జిబుల్‌ బ్యాటరీల తయారీకి వాడే కోబాల్ట్‌ ఖనిజం కూడా కాంగో నుంచే వస్తోంది. ఈ గనులను యంత్రాలతో కాకుండా కూలీలు చిన్న పనిముట్లతో చేతులతోనే తవ్వి వెనక్కి తీస్తారు.

దుర్భర పరిస్థితులుండే ఆఫ్రికా దేశాల నుంచే కాకుండా నిర్బంధ కూలీలు, బాల కార్మికులు పనిచేసే భారత్, చైనా దేశాల నుంచి కూడా స్మార్ట్‌ఫోన్ల తయారీకి ముడి సరకులొస్తున్నాయి. ముడి సరకు ఉత్పత్తిదారుడి వద్దకు చేరడానికి మధ్యలో పది చేతులు మారుతున్నాయి. ఈ పది చోట్లలో ఎక్కడో చోట కార్మికుడి రక్తం, స్వేద బిందువులు అంటుకుంటున్నాయి. చైనా లాంటి దేశాల్లో కార్మికులు ఏకబిగినా 36 గంటల షిప్టుల్లో పనిచేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది ప్రపంచ మార్కెట్‌లోకి 153 కోట్ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని అంచనా వేశారు. అలాగే 2020 నాటికి 2400 కోట్ల సెల్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నారు. అంటే ఎలాక్ట్రానిక్‌ వేస్టేజ్‌ ఎంతవుతుందో ఊహించండి!

ఈ వేస్టేజ్‌ వల్ల ప్రమాదకరమైన బ్రోమైడ్స్, బెరీలియం, లెడ్‌ భూమిలో, నీటిలో కలసిపోతోంది. ఇక వేస్టేజ్‌ని తగులబెట్టడం వల్ల డైయాక్సిన్లు, ఇతర విష వాయువులు వాతావరణంలో కలిసి పోతున్నాయి. అంటే మానవ రక్తంతో, స్వేదంతో తడిసిపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను మనం వాడడమే కాకుండా వాటిని పడేయడం ద్వారా సమస్త చరాచర ప్రపంచంని ముప్పును తెచ్చే కాలుష్యానికి కారణం అవుతున్నాం. ఈ విషయంలో రీసైక్లింగ్‌ వ్యవస్థ ఉన్నా, అది సక్రమంగా పనిచేయడం లేదు. ఒక్క అమెరికాలోనే అత్యధికంగా 29 శాతం ఎలక్ట్రానిక్‌ పరికరాలు రీసైకిల్‌ అవుతున్నాయి. ప్రపంచమంతా కలిపి కూడా 20 శాతం రీసైకిల్‌ అవడంలేదు.

అంటే 80 శాతం పరికరాలు భూమిలో, నీటిలో కలుస్తున్నాయి. భారత్‌ లాంటి దేశాల్లో ఈవేస్ట్‌ను ఎక్కువగా తగులబెడుతున్నారు. తద్వారా విష వాయువులు గాల్లో కలుస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. వినియోగదారులు వీలైనంతవరకు తమ ఎలక్ట్రానిక్‌ వస్తువులను పడేయకుండా కాలానుగుణంగా అప్‌డేట్‌ చేసుకోవడానికే మొగ్గుచూపాలి. కంపెనీలు కూడా పునరుత్పత్తికన్నా పాతవాటిని అప్‌డేట్‌ చేయడానికి కృషి చేయాలి. ఇక ఈ వేస్టేజ్‌ను అరికట్టేందుకు వివిధ దేశాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొనడంతోపాటు పటిష్టమైన చట్టాలు తీసుకరావాలి. అప్పుడే భవిష్యత్తు తరాల వారికి భూమి మీద బతికే అవకాశాన్ని కల్పించగలం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top