అమెరికాలో బెల్లంపల్లి యువకుడి మృతి

Bellampalli Man Died In America - Sakshi

ఫ్లోరిడాలో సముద్ర స్నానానికి వెళ్లి మృత్యువాత

బెల్లంపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మరణించాడు. టెక్సాస్‌ రాష్ట్రంలోని రిచ్‌మండ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బెల్లంపల్లికి చెందిన రెడ్డి శ్రావణ్‌ (27) ఆదివారం తన స్నేహితులతో కలసి సరదాగా ఫ్లోరిడా రాష్ట్రంలోని డెస్టిన్‌లో సముద్రస్నానానికి వెళ్లాడు. లోనికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పెద్ద అల ముంచెత్తడంతో శ్రావణ్‌ కొట్టుకుపోయాడు. దీంతో భీతిల్లిన స్నేహితులు బయటకు పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రావణ్‌ కోసం గాలింపు  చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో గల్లంతైనట్లు సోమవారం అతని తండ్రి రెడ్డి రాజంకు ఫోన్లో సమాచారం అందించారు.

చివరకు మృతదేహం లభ్యం కావడంతో మంగళవారం ఉదయం శ్రావణ్‌ నీటమునిగి మృతి చెందినట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించి వర్తమానం పంపారు. కొడుకు మరణ వార్త విని శ్రావణ్‌ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రావణ్‌ అకాల మరణం ఆ కుటుంబంలో విషాదఛాయలు నింపింది. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్‌... 2014లో ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లాడు. 2016లో ఎంఎస్‌ పూర్తి చేసిన శ్రావణ్‌ మరో విభాగంలోనూ ఎంఎస్‌ చేస్తున్నాడు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూనే చదువు కొనసాగిస్తున్నాడు. సింగరేణిలో మైనింగ్‌ సర్దార్‌గా పని చేసి రిటైరైన రెడ్డి రాజం, మాలతి దంపతుల నలుగురు సంతానంలో శ్రావణ్‌ చిన్నవాడు. శ్రావణ్‌ మృతదేహం బెల్లంపల్లికి రావడానికి మరో మూడు రోజులు పట్టొచ్చని అతని కుటుంబీకులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top