ఒంటరి

BBC Survey On Loneliness - Sakshi

‘ఒంటరితనాన్ని అణచిపెట్టినా, నిర్లక్ష్యం చేసినా.. ఆ భావన తాలూకు బాధ, సమస్య అలాగే ఉంటాయి’అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. యువతీ యవకుల్లో 40% మంది ఆ ఒంటరితనం బారినపడుతున్నారని, పెద్దల (27%)తో పోలిస్తే సమాజంతో వేరుపడిపోతున్న యువత సంఖ్య పెరుగుతోందని బీబీసీ ఇటీవల జరిపిన సర్వే చెబుతోంది. భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన 55,000 మంది (16 – 99 వయస్కులు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66% మంది స్త్రీలు. ‘ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ప్రపంచం నన్ను పక్కకు నెట్టేసినట్టు, ప్రపంచం నుంచి వేరుపడినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగాదిగులుగా వుంటుంది’అని ఒంటరితనం గురించి సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన వివరణ ఇది.మన దేశంలో జరిగిన కొన్ని అధ్యయనాలు కూడా ఇవే విషయాలు వెల్లడించాయి. 30% మంది యువతీ యువకులు ఒంటరితనానికి లోనవుతున్నట్టు 2016లో లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ (సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసై టీస్‌) జరిపిన శాంపిల్‌ సర్వే తెలిపింది. యువకుల (29%) కంటే యువతుల్లో (33%), పట్టణ యువత (29%) కంటే గ్రామీణ యువతలో (33%) ఒంటరితనం బాధితులు ఎక్కువని తేల్చింది.  

బీబీసీ సర్వేలో తేలిన అంశాలు

  •     16 – 24 వయసున్న యువతీయువకుల్లో 40% మందిని ఒంటరితనం వెంటాడుతోంది.
  •     ఒంటరితనం ఒక్కోసారి తమకు మంచి అనుభవాలనే పంచిందని 41% మంది చెప్పారు.  
  •     నిరుద్యోగుల్ని (వయసుతో నిమిత్తం లేకుండా) ఒంటరితనం మరింత బాధిస్తోంది.
  •     పూర్తిగా, పాక్షికంగా కంటిచూపు లేని వారిలోనూ, వివక్షకు గురువుతున్న వారిలోని ఒంటరితనపు యాతన ఎక్కువే.  
  •     సామాజికంగా – ఆర్థికంగా వెనుకబడిన వారు, గేలు.. వివక్ష ఎదురైన సందర్భాల్లో తమకు ఎవ్వరూ లేరనే వేదనలో కూరుకుపోతున్నారు.

ఏం చేయాలి?
‘ఏదైనా చదవండి లేదా పనిలో మునిగిపోండి. స్నేహితులు, కుటుంబంతో తరుచుగా మాట్లాడుతూ మీ ఆలోచనల్ని పంచుకోండి. మీరు కలిసే వ్యక్తుల్లో మంచినే చూడటం నేర్చుకోండి. ముందు ఒంటరితనం వెనుకున్న కారణాలు గ్రహించి అటువైపు ఆలోచించండి. మనసుకు నచ్చిన వారికి మీ వేదన చెప్పండి’అని ఒంటరితనం నుంచి బయటపడేందుకు బీబీసీ సర్వే నిర్వాహకులు ఇచ్చిన సలహాలివి.
ఆధునిక జీవితంలో ‘ఒంటరితనం’ఓ విషాద వాస్తవమంటున్నారు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే. ఆ దేశం ‘ఒంటరితనం’తాలూకు ప్రమాదకర పరిణామాల నుంచి ప్రజల్ని రక్షించే ఉద్దేశంతో ఒక మంత్రిత్వశాఖ (మినిస్టర్‌ ఫర్‌ లోన్లీనెస్‌)ను కూడా ఏర్పాటు చేసింది.

ఎందుకిలా?
యవ్వన దశలో జీవితంలో అనేక మార్పులొస్తాయి. చదువు, పనుల కోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. కొత్త వారితో మసలుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఇవి కొంతవరకు ఒంటరితనానికి కారణమవుతాయి. అయితే చుట్టూ ఉన్న వాతావరణం తమ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు అందులో ఇమడలేనప్పుడు.. ఆ ఒంటరితనం మరింత బాధిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. విద్యా సంస్థల్లో మంచి గ్రేడ్‌ సంపాదించకపోవడమనేది కొన్ని సందర్భాల్లో ఇతరులతో వేరుపడిపోయేందుకు, ఆపైన డిప్రెషన్‌లోకి జారుకునేందుకు దారి తీస్తుంటుందని వారు వివరిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న టెక్నాలజీ వాడకం, సోషల్‌ మీడియాలో గడపటం ఒంటరితనానికి కారణమవుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top