
ఎయిర్ ఏషియా: బ్లాక్ బాక్స్ ఏమైంది?
బోలెడన్ని నౌకలు, లెక్కలేనన్ని విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు జరుగుతోంది. అయినా బ్లాక్ బాక్స్ మాత్రం ఇంకా లభ్యం కాలేదు.
బోలెడన్ని నౌకలు, లెక్కలేనన్ని విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు జరుగుతోంది. ఆదివారంనాడు అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 85014 సముద్రంలోనే కూలిపోయిందన్న విషయం మంగళవారమే ఖరారైంది. కష్టమ్మీద ఇప్పటికి మూడు మృతదేహాలను వెలికితీశారు. అయితే.. ఇప్పటికీ విమాన శకలాలు పూర్తిస్థాయిలో లభ్యం కాలేదు. అలాగే విమానం బ్లాక్ బాక్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. మరోవైపు వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో గాలింపు చర్యలకు పదే పదే ఆటంకం కలుగుతోంది. బోర్నియో తీరంలో పలు మృతదేహాలతో పాటు విమనా శకలాలు కూడా సముద్రంలో తేలుతున్నట్లు గాలింపు చర్యల్లో గుర్తించారు.
కానీ అలలు 2-3 మీటర్ల ఎత్తున వస్తుండటం, గాలులు కూడా తీవ్రంగానే ఉండటంతో డైవర్లు కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడంలేదు. కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో మొత్తం 162 మంది ఉండగా.. కేవలం ముగ్గురి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. వాతవరణం అనుకూలిస్తే.. డైవర్లు వెంటనే రంగంలోకి దిగి మిగిలిన మృతదేహాలను తీస్తారని తెలుస్తోంది.