breaking news
air asia tragedy
-
రెండు నిమిషాల ఆలస్యం ఖరీదు.. 162 ప్రాణాలు!
ఒక్క రెండు నిమిషాలు.. ఆ రెండు నిమిషాలు ముందుగా ఆదేశాలు వచ్చి ఉంటే 162 మంది ప్రాణాలు దక్కేవి. విమానం సముద్రంలో కూలి ఉండేది కాదు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ఆలస్యమే కారణమైంది. ఈ విషయం తాజాగా విడుదలైన ఓ ట్రాన్స్క్రిప్టులో తెలిసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలుకు, ఎయిర్ ఏషియా విమానం పైలట్‌కు మధ్య జరిగిన సంభాషణ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని, అందువల్ల తాను ఎడమవైపు తిరిగి మరి కొంత ఎత్తుకు వెళ్తానని పైలట్ కోరారు. ఎడమవైపు తిరిగేందుకు ఏటీసీ అనుమతించడంతో.. అలా ఏడుమైళ్ల దూరం వెళ్లారు. కానీ మరింత ఎత్తులో వెళ్తానని పైలట్ ఇర్యాంటో అడిగారు. ఎంత ఎత్తు అని ఏటీసీ నుంచి ప్రశ్న వచ్చింది. 38 వేల అడుగులు.. అని ఆయన చెప్పారు. కానీ దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అవునని చెప్పలేకపోయింది. ఎందుకంటే.. అదే సమయానికి ఆ ఎత్తులో మరో ఆరు విమానాలు కూడా ఎగురుతున్నాయి. దాంతో తప్పనిసరిగా ఎయిర్ ఏషియా విమానం తక్కువ ఎత్తులోనే ఎగరాల్సి వచ్చింది. తీరా ఏటీసీ నుంచి సరే.. పైకి వెళ్లమని ఆదేశాలు వచ్చేసరికి రెండు నిమిషాలు గడిచింది. సరిగ్గా ఉదయం 6.14 గంటలకు ఎత్తుకు వెళ్లొచ్చన్నారు. కానీ ఆ ఆదేశాలకు తిరిగి సమాధానం రాలేదు. ఎందుకంటే.. అప్పటికే విమానం కూలిపోయింది!! పైలట్ ఇర్యాంటో సహా మొత్తం 162 మందీ జలసమాధి అయిపోయారు!! -
ఎయిర్ ఏషియా: బ్లాక్ బాక్స్ ఏమైంది?
బోలెడన్ని నౌకలు, లెక్కలేనన్ని విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు జరుగుతోంది. ఆదివారంనాడు అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 85014 సముద్రంలోనే కూలిపోయిందన్న విషయం మంగళవారమే ఖరారైంది. కష్టమ్మీద ఇప్పటికి మూడు మృతదేహాలను వెలికితీశారు. అయితే.. ఇప్పటికీ విమాన శకలాలు పూర్తిస్థాయిలో లభ్యం కాలేదు. అలాగే విమానం బ్లాక్ బాక్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. మరోవైపు వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో గాలింపు చర్యలకు పదే పదే ఆటంకం కలుగుతోంది. బోర్నియో తీరంలో పలు మృతదేహాలతో పాటు విమనా శకలాలు కూడా సముద్రంలో తేలుతున్నట్లు గాలింపు చర్యల్లో గుర్తించారు. కానీ అలలు 2-3 మీటర్ల ఎత్తున వస్తుండటం, గాలులు కూడా తీవ్రంగానే ఉండటంతో డైవర్లు కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడంలేదు. కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో మొత్తం 162 మంది ఉండగా.. కేవలం ముగ్గురి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. వాతవరణం అనుకూలిస్తే.. డైవర్లు వెంటనే రంగంలోకి దిగి మిగిలిన మృతదేహాలను తీస్తారని తెలుస్తోంది.