ట్రామ్‌రైలులో కాల్పులు

3 Dead, 9 Injured in Dutch Tram Shooting - Sakshi

నెదర్లాండ్స్‌లో ఉగ్ర దాడి.. ముగ్గురు మృతి

ది హేగ్‌: న్యూజిలాండ్‌లో నరమేధం ఘటన మరవకముందే నెదర్లాండ్స్‌ నెత్తురోడింది. నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్‌ పట్టణంలో సోమవారం ట్రామ్‌రైలులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మేయర్‌ జాన్‌వాన్‌ జానెన్‌ ప్రకటించారు. ఈ చర్య ఉగ్రదాడేనని భావిస్తున్నట్లు చెప్పారు.  కాల్పులు జరిపిన తరువాత దుండగుడు పారిపోయాడని, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు.

ఘటనాస్థలికి ప్రజల రాకపోకల్ని నియంత్రించి, దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు అక్కడికి హెలికాప్టర్లను పంపించామని చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ భవనం ముందు ఉగ్ర వ్యతిరేక బలగాలు తనిఖీలు విస్తృతం చేశాయి. కెమెరాలతో కూడిన జాకెట్లు వేసిన జాగిలాలతో ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఉట్రెక్ట్‌లో ట్రామ్‌ పట్టాలపై వస్త్రాలతో కప్పిన మృతదేహాలు ఉన్న చిత్రాల్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని మార్క్‌ రుటె తన అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని, అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. దేశంలో అసహనానికి చోటులేదని, ఈ దాడిలో ఉగ్ర కోణాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు.

అనుమానితుడి అరెస్ట్‌..
సోమవారం ట్రామ్‌రైలులో దాడికి అనుమానితుడిగా భావిస్తున్న టర్కీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకుముందు, గోక్‌మన్‌ టానిస్‌గా గుర్తించిన అతని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నలుపు రంగు దుస్తులు, గడ్డంతో అతను ట్రామ్‌లో ప్రయాణిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దాడి తరువాత ఉట్రెక్ట్‌ పట్టణంలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు విమానాశ్రయాలు, ఇతర కీలక భవనాలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పొరుగునున్న యూరప్‌ దేశాల్లో అడపాదడపా ఉగ్ర దాడులు జరిగినా, నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఘటనలు అరుదే. గత ఆగస్టులో 19 ఏళ్ల అఫ్గాన్‌ పౌరుడు అమ్‌స్టర్‌డ్యామ్‌ ప్రాంతంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఇద్దరు అమెరికన్లను గాయపరిచాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top