నేపాల్ ప్రాణనష్టం 10 వేలు!

నేపాల్ బాధితులకు బాసటగా అమెరికాలోని న్యూయార్క్ లో జాక్సన్ హైట్స్ భవనం వద్ద సందేశాన్ని అతికిస్తున్న చిన్నారి - Sakshi


భూకంప మృతులపై ప్రధాని కొయిరాలా అంచనా

దేశ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి

సహాయ చర్యలు అత్యుత్తమంగా లేవని అసంతృప్తి


కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ భూవిలయంలో మృతుల సంఖ్య 10 వేల వరకు ఉండొచ్చని ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలా వెల్లడించారు. నేపాల్‌లోని భారత్, చైనా, అమెరికా రాయబారులతో మంగళవారం సమావేశమైన కొయిరాలా.. శనివారం నాటి భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 4,400 మంది చనిపోయారని, ఇంకా వేలాది మంది జాడ తెలియడం లేదని, తీవ్రంగా గాయపడిన వారు కూడా వందల్లోనే ఉన్నారని వివరించారు. వీటితో పాటు మంచు చరియల కింద కూరుకుపోయిన చిన్న చిన్న జనావాసాల్లోని మృతుల వివరాలన్నీ వెల్లడైతే.. మొత్తం మృతుల సంఖ్య 10 వేలకు చేరుతుందని భావిస్తున్నామన్నారు. సహాయ చర్యల కోసం తక్షణ సాయంతో పాటు, దేశ పునర్నిర్మాణం కోసం విస్తృత స్థాయిలో అంతర్జాతీయ సహకారం అవసరమవుతుందని  తెలిపారు.





ఈ సందర్భంగా ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో భారత్ అందిస్తున్న సాయం వివరాలను కొయిరాలాకు భారత రాయబారి రంజిత్ రాయ్ తెలిపారు. సంక్షోభ సమయంలో నేపాల్‌కు అండగా నిలిచిన భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచ స్థాయి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అమెరికా కొనియాడగా, భారత్ అందిస్తున్న సాయంపై నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. కఠ్మాండులో ప్రజలు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, నేపాల్ మరో పొరుగుదేశం చైనా కూడా సహాయ, రక్షక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకుంటోంది. రక్షక సిబ్బందిని, సహాయ సామగ్రిని పెద్ద ఎత్తున నేపాల్‌కు పంపించింది. నేపాల్ సంక్షోభంపై చర్చించేందుకు కొయిరాలా మంగళవారం అఖిల పక్ష నేతలతో సమావేశమయ్యారు.





సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు, దుప్పట్లు మొదలైన నిత్యావసరాలను పంపిస్తున్నప్పటికీ.. బాధితులందరినీ ఆదుకునే స్థాయిలో సహాయ సామగ్రి, సిబ్బంది ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదని వారికి వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులకు సాయం అందడం లేదన్నారు.  భూకంప అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా నేపాల్‌లోని 9 జిల్లాలను నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.


మరిన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు

భూకంప బాధితుల సహాయార్థం భారత జాతీయ విపత్తు స్పందన దళానికి(ఎన్‌డీఆర్‌ఎఫ్) చెందిన మరో ఆరు బృందాలను మంగళవారం భారత్ నేపాల్‌కు పంపించింది. ఇప్పటికే పది బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఒక్కో బృందంలో సుమారు 45 మంది ఉంటారు. ఇప్పటివరకు ఈ బృందాలు శిథిలాల నుంచి 11 మందిని రక్షించాయి. 73 మృతదేహాలను వెలికితీశాయి. ఏ ప్రాంతాలకు సహాయ బృందాలను పంపాలనే విషయాన్ని నిర్ధారించేందుకు భారత్ నుంచి వెళ్లిన మానవరహిత విమానాన్ని వినియోగిస్తున్నారు. భూకంప కేంద్రమైన గోర్ఖా జిల్లాలో భారత సైనికులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.  



భారత్‌లో మృతులు 75

భారత్‌లో భూకంప మృతుల సంఖ్య 75కి చేరింది. వారిలో 58 మంది ఒక్క బిహార్‌లోనే మృత్యువాత పడ్డారని, బిహార్, పశ్చిమబెంగాల్, యూపీ, రాజస్థాన్, సిక్కింలలో దాదాపు 450 మంది గాయపడ్డారని  కేంద్రం తెలిపింది. భారత్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను అంచనా , సహాయ చర్యల పర్యవేక్షణకు నలుగురు కేంద్రమంత్రులను ప్రధాని నియోగించారు.

 

సాయం సరిపోవడం లేదు

కఠ్మాండు నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్: వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయ సిబ్బంది రాత్రింబవళ్లు సహాయ చర్యల్లో నిమగ్నమవుతున్నప్పటికీ.. ఇంకా సాయం అందని బాధితులు వేలల్లో ఉన్నారు.  అంతర్జాతీయ సహాయక సిబ్బంది సేవలు నేపాల్ పల్లెలకు చేరడం లేదు. భూకంపం వచ్చిన శనివారం నుంచి ఇప్పటివరకు 5 వేల మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిగా బాధితులు ఆహారం, తాగునీరు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.



భూకంప ప్రభావం 80 లక్షల మందిపై పడిందని, 14 లక్షల మందికి ఆహారం తదితర నిత్యావసరాలు అందడం లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.మంగళవారం మధ్యాహ్నం వరకూ చురుగ్గా సాగిన సహాయ కార్యక్రమాలు వర్షం పడటంతో కొద్దిసేపు నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి గుడారాల్లో ఉన్న వారికి వర్షం మరింత ఇబ్బందిగా మారింది. అయితే భారత్ నుంచి పెద్ద ఎత్తున టెంట్లు, సహాయ సామగ్రి చేరటంతో కొంత ఊరట లభించింది. పశుపతినాథ్‌ఆ లయం దగ్గర ఒకే చోట 200 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు.  పోఖ్రాకు వెళ్లే దారిలో సాక్షి బృందం పర్యటించిన 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా జనావాసం ఆనవాలు కూడా లేకుండా పోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top