ప్రత‍్యేక హోదాపై గళం విప‍్పండి: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

ప్రత‍్యేక హోదాపై గళం విప‍్పండి: వైఎస్‌ జగన్‌

Published Sun, Jan 29 2017 12:36 PM

YS Jagan meeting with MPs Over Parliament Sessions


హైదరాబాద్‌ :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత‍్యేక హోదాయే సంజీవిని, హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష‍్యత్తులేదని వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకోసం పార‍్లమెంట్‌లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార‍్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

ఈ సందర‍్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రత‍్యేక ప్యాకేజీ పేరుతో ముఖ‍్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రత‍్యేక హోదాకు ఏదీ సాటిరాదని దీనిపై పార‍్లమెంట్‌ ఉభయ సభల‍్లో గళం వినిపించాలని, కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశం ముగిసిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానంగా చర్చ జరిగిందని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చి మాట మార్చారన్నారు. ఇప్పుడు హోదాతో ప్రయోజనం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి హోదాతోనే పరిశ్రమలు రాయితీలు వస్తాయని చెప్పారు. హోదాతోనే 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు.

చట‍్టంలో ఉన‍్నవే చేస్తున‍్నప్పుడు మళ్లీ చట‍్టబద‍్ధత అనే మాటకు అర‍్థంలేదని చెబుతున‍్నారని, దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక ప్యాకేజీ, చట‍్టబద‍్ధత అనే మాటలు బూటకమని, ఆ పేర‍్లతో ముఖ‍్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన సదస్సుల్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement