
బీటెక్ పరీక్ష ఇంట్లో రాస్తూ.. దొరికేశాడు!
ఫెయిల్ అయిన పరీక్ష ఎలాగైనా పాస్ కావాలని నిర్ణయించుకున్న ఓ యువకుడు అందుకు వేసుకున్న పథకాన్ని ....
తుర్కయంజాల్: ఫెయిల్ అయిన పరీక్ష ఎలాగైనా పాస్ కావాలని నిర్ణయించుకున్న ఓ యువకుడు అందుకు వేసుకున్న పథకాన్ని ఎస్‌ఓటీ పోలీసులు చిత్తు చేయడంతో, సదరు యువకునితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన వినీత్‌గౌడ్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మూడో సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. తిరిగి పరీక్ష రాసేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన అతను సోమవారం ఇనాంగూడలోని నారాయణ కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. ఎలాగైనా పాస్ కావాలన్న దురుద్దేశంతో వినీత్‌గౌడ్ తన మిత్రుడైన భరత్‌కు విషయం చెప్పాడు.
దీంతో అతను నారాయణ కళాశాలలో గతంలో పనిచేసి మానేసిన తన స్నేహితుడు విష్ణును సాయం కోరాడు. విష్ణు నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణకు రూ.10 వేలు లంచం ఇవ్వడంతో అతను సోమవారం జరగాల్సిన పరీక్ష ప్రశ్నాపత్రాన్ని వారికి అందజేశాడు. దీంతో వారు ఇనాంగూడలోని భరత్ ఇంట్లో పరీక్ష రాయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసిపోయింది. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు.. దాడులు నిర్వహించి వినీత్‌గౌడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతడికి సహకరించిన నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 7,500 నగదు, హాల్‌టికెట్, ఆన్సర్ బుక్‌లెట్, ఓఎంఆర్ షీటు, నామినల్ రోల్ షీటు, అటెండెన్స్ షీటు, క్వశ్చన్ పేపర్‌ను సీజ్ చేశారు.