ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి | what will you take action on private schools extra fees | Sakshi
Sakshi News home page

ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి

Mar 29 2016 2:22 AM | Updated on Sep 3 2017 8:44 PM

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రై వేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెషల్ ఫీజు అంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్‌ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
 
 ఈ సందర్భంగా తమకు కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కొన్ని స్కూళ్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ, కొన్ని పాఠశాలలు అసాధారణ రీతిలో ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు. తాము నిర్వహించిన విచారణలో ఈ విషయం తేలిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు నోటీసులు కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలను తమ ముందుంచాలని సంజీవ్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలల్లో ప్రవేశాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేయబోమన్న ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement