కడియాల వెనుక కథేంటి? | What is behind the kadiams | Sakshi
Sakshi News home page

కడియాల వెనుక కథేంటి?

May 13 2017 12:42 AM | Updated on Sep 5 2017 11:00 AM

కడియాల వెనుక కథేంటి?

కడియాల వెనుక కథేంటి?

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు షికాగో, షార్జా నుంచి వచ్చారు.

- పసిడిని కడియాల రూపంలో తెచ్చిన ఇద్దరు మహిళలు
- అనుమానంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌.. అక్రమ రవాణాగా నిర్ధారణ
- ఇద్దరి నుంచి 784 గ్రాముల బంగారం స్వాధీనం


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు షికాగో, షార్జా నుంచి వచ్చారు. చాలా నీట్‌గా ఉన్న వీరి చేతులకు ఉన్న కడియాలు మాత్రం నాటుగా కనిపించాయి. అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకోగా... అది అక్రమ రవాణాగా తేలింది. మొత్తం 784 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఆ ఇద్దరినీ విచారిస్తోంది. ఇది వ్యవస్థీకృత వ్యవహారం కాదని, ఇరువురూ సొంత అవసరాలకే తీసుకువస్తున్నారని కస్టమ్స్‌ అధికారులు భావిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం అమెరికాలోని షికాగో వెళ్లింది.

తిరిగి వస్తూ తనతో పాటు బంగారం తెచ్చుకోవాలని భావించింది. దీంతో అక్కడ 385 గ్రాముల బంగారం ఖరీదు చేసింది. ఇందులో ఒక గోల్డ్‌ కాయిన్‌ మినహా మిగతా బంగారాన్ని ఆరు కడియాల రూపంలోకి మార్చింది. నాలుగు రోజుల క్రితం బంగారం ఖరీదు చేయడానికి షార్జాకు వెళ్లిన మరో నగర మహిళ అక్కడ 399 గ్రాముల బంగారం కొనుగోలు చేసింది. దీన్ని మూడు కడియాల రూపంలోకి మార్పించింది. వీరిద్దరూ ఆ కడియాలను ధరించి శుక్రవారం వేర్వేరు విమానాల్లో శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. విదేశాల నుంచి బంగారం తెచ్చుకునేవారు ఆ విషయాన్ని కస్టమ్స్‌ అధికా రులకు తెలిపి, 35 శాతం సుంకం చెల్లించాలి.

ఈ ఇద్దరు మహిళలూ ఆ సుంకం తప్పించుకోవడం కోసం బంగారు కడియాలను ఆభరణాల మాదిరిగా ధరించి తీసుకువచ్చారు. విమానాశ్రయంలో వీరు ధరించిన కడియాలను చూసిన కస్టమ్స్‌ అధికారులకు అనుమానం కలిగింది. అవి 24 క్యారట్‌ బంగారంతో చేసినవి కావడంతో పాటు ఆభరణాల మాదిరిగా ఎలాంటి డిజైన్‌ లేకుండా పూర్తి నాటు పద్ధతిలో ఉండటంతో కస్టమ్స్‌ అధికారులకు ఈ అనుమానం వచ్చింది. దీంతో ఇరువురినీ అదుపులోకి తీసుకోగా అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. ఇరువురి నుంచి కస్టమ్స్‌ అధికారులు రూ.22.5 లక్షల విలువైన 784 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement