డిగ్రీ ప్రవేశాలకు ఇంటి నుంచే వెబ్‌ ఆప్షన్లు | Web options from home to degree entries | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రవేశాలకు ఇంటి నుంచే వెబ్‌ ఆప్షన్లు

May 17 2017 3:54 AM | Updated on Apr 7 2019 3:35 PM

డిగ్రీ ప్రవేశాలకు ఇంటి నుంచే వెబ్‌ ఆప్షన్లు - Sakshi

డిగ్రీ ప్రవేశాలకు ఇంటి నుంచే వెబ్‌ ఆప్షన్లు

ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా విద్యార్థులు

- విద్యార్థులకు వెసులుబాటు కల్పించిన ఉన్నత విద్యామండలి
- వివరాల నమోదు మాత్రం ఈ–సేవా/మీ–సేవా కేంద్రాల్లోనే
- అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ విద్యార్థులకు చివరి దశలో అవకాశం  


సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా విద్యార్థులు ఇంటి నుంచి, ఇంటర్నెట్‌ కేంద్రాలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్‌ కేంద్రాల ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఉండనున్న నేపథ్యంలో వెబ్‌ ఆప్షన్లు ఎక్కడి నుంచైనా ఇచ్చుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే డిగ్రీలో ప్రవేశాలకు మాత్రం ఈ–సేవా/మీ–సేవా కేంద్రాలకు విద్యార్థులు స్వయంగా వెళ్లి తమ వివరాలు నమోదు చేయించుకుని వేలి ముద్రలు ఇవ్వాలని డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మల్లేశ్‌ వివరించారు.

అలాగే విద్యార్థులు తమ ఆధార్, ఇంటర్మీడియెట్‌ హాల్‌టికెట్, ఫోన్‌ నంబర్లను ఈ–సేవా/మీ–సేవా కేంద్రాల్లో ఇవ్వాలని తెలిపారు. ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను ప్రలోభపెట్టకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఈ–సేవా/మీ–సేవా కేంద్రం ఇచ్చే యూనిక్‌ ఐడీ/టోకెన్‌ నంబరు సహాయంతో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ వివరాలతో తమ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం రూ. 100 ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. తర్వాత విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు (కాలేజీలను ఎంచుకోవాలని) ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. రిజర్వేషన్‌ కేటగిరీల వారు 2017 మార్చి తర్వాత జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు చివరి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. వారి ఫలితాలు వచ్చాక, ఆలస్య రుసుము లేకుండానే వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత జారీ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement