సూత్రప్రాయంగా నిర్ణయించాం

సూత్రప్రాయంగా నిర్ణయించాం


- జింఖానా, బైసన్‌పోలో బదలాయింపుపై కేంద్రం

- వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌ : ఆర్మీ అధీనంలో ఉన్న సికింద్రాబాద్‌లోని జింఖానా, బైసన్‌ పోలో మైదానాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తి కావడానికి ముందు అనేక విధివిధానాలను పూర్తిచేయాల్సి ఉందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 10కి వాయిదా వేసింది.ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మా సనం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం తదితరాల నిర్మాణం కోసం జింఖానా, బైసన్‌ పోలో గ్రౌండ్‌లను తెలంగాణకు కేటాయించ కుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు, మరికొందరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది.స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నారు...

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఈ మైదానాల బదలాయింపుపై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ తరువాతనే ముందుకెళతామని రాష్ట్ర ప్రభుత్వా నికి రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిందన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, సునీల్‌ భాస్కరరావు వాదనలు విని పిస్తూ... స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ప్రజల హక్కని, అయితే ఖాళీ స్థలాలు లేకపోవడం వల్ల ఆ హక్కుకు విఘాతం కలుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఒక్కొక్కరికీ ఆరు చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలని, అయితే నగరంలో ఒక్క చదరపు మీటరు కూడా లేదన్నారు.ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన మైదానాల్లో రోడ్డు సహా ఎటువంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీల్లేదని వివరించారు. మరో సీనియర్‌ న్యాయ వాది పి.గంగయ్యనాయుడు స్పందిస్తూ... ఈ గ్రౌండ్‌లలో సచివాలయం తదితర నిర్మాణాలకు మాజీ పోలీసు అధికారుల సంఘం మద్దతు తెలుపుతోందని, అందువల్ల ఆ సంఘాన్ని ఇందులో ఇంప్లీడ్‌ చేసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు వినకుండా ఇంప్లీడ్‌పై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం చెప్పింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ గ్రౌండ్‌లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తాము నిర్మాణాలు చేపట్టబోమని ఏజీ చెప్పడంతో ధర్మాసనం దానిని పరిగణనలోకి తీసుకుంటూ విచారణను వాయిదా వేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top