రవాణాశాఖలో మీరే కీలకం | ur the most imp in Transport | Sakshi
Sakshi News home page

రవాణాశాఖలో మీరే కీలకం

Aug 8 2016 10:55 PM | Updated on Sep 4 2017 8:25 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన 23మంది సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం నియామక పత్రాలను అందజేశారు.

► 23 మంది ఏవీఎంఐలకు నియామక పత్రాలు    అందజేసిన మంత్రి
► త్వరలో విధుల్లో చేరనున్న
► మరో 20 మంది


సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన 23మంది సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం నియామక పత్రాలను అందజేశారు. మరో 20 మంది త్వరలో విధుల్లో చేరనున్నారు. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న 44 సహాయ మోటారు వాహన తనిఖీ అధికారుల ఖాళీల భర్తీకి గత సంవత్సరం  సెప్టెంబర్‌లో టీఎస్‌పీఎస్‌సీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 6053 మంది పోటీపడ్డారు. వారిలో 84 మందిని  ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. వీరిలోంచి  44 పోస్టులకు గాను 43 మందిని ఎంపిక చేశారు. మరో పోస్టు  పెండింగ్‌లో ఉంది. ఎంపికైన 43 మందిలో  23 మంది  సోమవారం ఖైరతాబాద్‌లోని  రవాణా కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందుకున్నారు.

మిగతా వాళ్లు సైతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం విధుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణాశాఖలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లదే కీలకమైన బాధ్యత  అని, విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతతో పాటు, ప్రభుత్వానికి ఆదాయాన్ని తేవడంలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు.  కార్యక్రమంలో తెలంగాణ మోటారు వాహన తనిఖీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపారావు, జేటీసీలు వెంకటేశ్వర్లు, రఘునాథ్, పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement