మరోసారి విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరిచేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిద్ధమైంది.
మరోసారి విద్యుత్ చార్జీలు పెంపునకు బాబు సర్కారు సిద్ధం
రేపు ఈఆర్‌సీకి డిస్కమ్‌ల ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: మరోసారి విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరిచేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిద్ధమైంది. చార్జీల పెంపు దాదాపు 20 శాతం వరకు ఉండవచ్చని విశ్వసనీయం సమాచారం. ఈ లెక్కన ప్రజలపై దాదాపు రూ.1,129 కోట్ల మేర అదనంగా భారం పడే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది కూడా గడవకుండానే రూ.941 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచింది. తాజాగా మరోసారి విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) గురువారం 2016-17 వార్షిక ఆదాయ, అవసర ప్రతిపాదనలను (ఏఆర్‌ఆర్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించే యోచనలో ఉన్నాయి.
నిబంధనల ప్రకారం గత నవంబర్ నెలాఖరులోనే ఏఆర్‌ఆర్‌లు సమర్పించాల్సి ఉంది. అయితే పంపిణీ సంస్థలు నెల రోజులు గడువు పొడిగించాలని ఈఆర్‌సీని కోరాయి. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు గురువారం సమర్పించే ప్రతిపాదనలకు ఈఆర్‌సీ ఆమోదిస్తే.. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి. పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, వీటిని పూడ్చుకోవాలంటే చార్జీల పెంపు అనివార్యమంటూ డిస్కమ్‌లు కాకిలెక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి