అంతులేని వేదన | The endless agony | Sakshi
Sakshi News home page

అంతులేని వేదన

Dec 13 2014 11:44 PM | Updated on Apr 3 2019 8:07 PM

అంతులేని వేదన - Sakshi

అంతులేని వేదన

రోజూలాగానే ఉదయాన్నే పరేడ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికులూ విషాదంలో మునిగిపోయారు.

గోషామహల్ స్టేడియంలో ఘటన
గతంలో రాష్ట్రపతి శౌర్యపతకం పొందిన సుధాకర్
కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి

 
రోజూలాగానే ఉదయాన్నే పరేడ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికులూ విషాదంలో మునిగిపోయారు.
 
అఫ్జల్‌గంజ్,బంజారాహిల్స్,మలేషియా టౌన్‌షిప్:  పోలీస్ పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్  గుండెపోటుతో కుప్పకూలి, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం గోషామహల్ పోలీసు స్టేడియంలో చోటుచేసుకుంది.  వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ సత్తెనపల్లి గ్రామానికి  గడ్డిపాటి సుధాకర్ (42) బంజారాహిల్స్ ఠాణాలో కానిస్టేబుల్ (ఐడీపార్టీ)గా విధులు నిర్వహిస్తున్నాడు. గోషామహల్ పోలీసు స్టేడియంలో వారినికోసారి పోలీసులకు జరిగే పరేడ్‌లో  పాల్గొనేందుకు శనివారం ఉదయం 6 గంటలకు గ్రౌండ్‌కు చేరుకున్నాడు. ఏడు గంటలకు పరేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే గుండెపోటు రావడంతో సుధాకర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన సహచర సిబ్బంది అతడ్ని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో హోరెత్తింది. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, అడిషనల్ డీసీపీ నాగరాజు, గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్‌స్పెక్టర్ సత్తయ్యగౌడ్, పోలీసు అధికారుల సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, నేతలు ఎన్.శంకర్‌రెడ్డి, మాధవరెడ్డి, ప్రకాష్, సూరిలు కేర్ ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ సుధాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
 అన్ని విధాల ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి

సుధాకర్ మృతి శోచనీయమని, అతడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.  పోలీసు సిబ్బంది ఆరోగ్యవంత జీవనం గడిపేందుకు ఇటీవలే పోలీసు సిబ్బందికి యోగా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.  సుధాకర్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కేర్ ఆసుపత్రి నుంచి స్వగృహానికి తరలించారు.
 
విషాదఛాయలు...

సుధాకర్ మృతితో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే పోలీసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పి. మురళీకృష్ణ కంటనీరు పెట్టుకున్నారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.  కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుధాకర్  15 సంవత్సరాలుగా కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుధాకర్‌కు భార్య శ్యామల, ప్రభాస్, లక్కి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన సుధాకర్ గతంలో రాంగోపాల్‌పేట పంజాగుట్ట, సికింద్రాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో విధులు నిర్వహించాడు.  పార్క్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో వీరోచితంగా పోరాడి రోగులను రక్షించినందుకు రాష్ట్రపతి శౌర్యపతకం వచ్చింది. మూడు హత్య కేసులు ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు సుధాకర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపినట్లు కేపీహెచ్‌బీ టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జనగాం సురేష్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement