పాఠ్య పుస్తకం మరింత ప్రియం!

పాఠ్య పుస్తకం మరింత ప్రియం!

‘విక్రయించే’ పుస్తకాల ధరలపై జీఎస్టీ ప్రభావం

రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల ధరలపైనా జీఎస్టీ ప్రభావం పడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచే ‘సేల్‌’ పాఠ్య పుస్తకాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగితం, ఇంకు ధరలు, నిర్వహణ వ్యయం పెరిగాయంటూ పబ్లిషర్లు ఈ విద్యా సంవత్సరమే సేల్‌ పాఠ్య పుస్తకాల ధరలను 13 శాతం వరకు పెంచారు. తాజాగా జీఎస్టీ ప్రభావంతో వచ్చే ఏడాది కూడా ధరలు పెరగనున్నాయి. దాదాపు 1.8 కోట్ల పాఠ్య పుస్తకాలకు అవసరమైన కాగితం కొనుగోలుపై జీఎస్టీ ప్రభావం పడనుందని, దానివల్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉంటుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 31 లక్షల మంది విద్యార్థులపై భారం పడనుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 29 లక్షల మంది విద్యార్థు లకు అవసరమైన 1.65 కోట్ల పాఠ్య పుస్తకాలపైనా జీఎస్టీ ప్రభావం ఉంటుందా, ఉండదా? అన్న అంశంపైనా పరిశీలన జరుపుతు న్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పాఠ్య పుస్తకా లకు అవసరమైన కాగితంపై వ్యాట్‌ మినహాయింపు ఉందని.. తాజాగా జీఎస్టీ మినహాయింపు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు.          – సాక్షి, హైదరాబాద్‌

 

‘పెరుగుదల’పై కసరత్తు

ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాల కోసం పబ్లిషర్లు గతేడాది ఎన్ని టన్నుల కాగితాన్ని వినియోగించారు, జీఎస్టీకి ముందు ధరలు ఎలా ఉన్నాయి, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ధరలు ఏ మేరకు పెరిగాయన్న అంశాలపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. తద్వారా ధరల పెరుగుదల ఎలా ఉంటుందన్నది అంచనా వేయనుంది. అయితే మొత్తానికి సేల్‌ పాఠ్య పుస్తకాల ధరల పెరుగుదల తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

 

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించండి: కమిషనర్‌

ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించాలని పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ ముద్రణాలయం అధికారులకు సూచించారు. కాగితంపై, ముద్రణపై ఎంతెంత జీఎస్టీ ఉంది, మినహాయింపులేమైనా ఉన్నాయా, భారం ఎంత ఉంటుందన్న అంశాలపై సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కాగితంపై 18 శాతం, ముద్రణపై 5 శాతం జీఎస్టీ ఉందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటివరకు ఉచిత పాఠ్య పుస్తకాలపై వ్యాట్‌ మినహాయింపు ఉందని.. జీఎస్టీ ఎలా ఉంటుందన్న విషయంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 

 

రాష్ట్ర గేయం లేకుండానే పుస్తకాలు

తెలంగాణ ఏర్పడి మూడేళ్లు గడు స్తున్నా రాష్ట్ర గేయం ఏమిటన్నది ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. దాంతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం లేకుండానే, రాష్ట్ర గేయం ఆలపించకుండానే పాఠ్యాంశాల బోధన కొనసాగుతోంది. 2014 జూన్‌ 2న రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 2014–15 విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిపోయింది. దాంతో రాష్ట్ర గేయాన్ని మార్చలేదు. ఇక 2015–16కు అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం విద్యాశాఖ 2014 సెప్టెంబర్‌లోనే చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర గేయం ఏమిటన్న సందిగ్ధం, ప్రభుత్వం కూడా త్వరగా ఏమీ తేల్చకపోవడంతో... అప్పటివరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్ర గేయాన్ని (మా తెలుగుతల్లికి మల్లెపూదండ..) మాత్రం తొలగించి పాఠ్య పుస్తకాలను ముద్రించింది. తర్వాత 2016–17 సంవత్స రానికి గాను 2015 సెప్టెంబర్‌లోనే కసరత్తు మొదలుపెట్టింది.



రాష్ట్ర గేయం పై స్పష్టత కావాలని.. ‘జయజయహే తెలంగాణ.. జనని జయ కేతనం..’.. గేయాన్ని రాష్ట్ర గేయంగా ముద్రించాలా వద్దా అని ప్రభుత్వాన్ని కోరింది. అయినా సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత (2017–18) విద్యా సంవ త్సరానికి పుస్తకాల ముద్రణపై 2016 డిసెంబర్‌ నాటికి కూడా స్పష్టత రాలేదు. అయినా ‘జయజయహే..’ గేయంలో 10 జిల్లాల ప్రస్తావనే ఉందని, ఇప్పుడు తెలంగాణలో 31 జిల్లాలు అయ్యాయని.. దీనిపై తరువాత నిర్ణయం తీసుకుందా మని పక్కన పెట్టారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాల టెండర్ల ప్రక్రియపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారైనా రాష్ట్ర గేయంపై స్పష్టత వస్తుందా, రాదా? అన్న సందేహం నెలకొంది.

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top