ఇన్‌స్పెక్టర్లకు రికవరీ టెన్షన్! | Tension recovery piece! | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పెక్టర్లకు రికవరీ టెన్షన్!

Dec 23 2013 3:39 AM | Updated on Sep 2 2017 1:51 AM

ఇన్‌స్పెక్టర్లకు రికవరీ టెన్షన్!

ఇన్‌స్పెక్టర్లకు రికవరీ టెన్షన్!

డిసెంబర్ అనగానే పోలీసు అధికారులకు టెన్షన్.... పెండింగ్ కేసులతో పాటు రికవరీ అయిన చోరీ సొత్తు వివరాలను ఈనెలాఖరులో వెల్లడించాల్సి ఉండటమే దీనికి కారణం.

=నెలాఖరులో వివరాలు వెల్లడించాల్సి ఉండమే కారణం
 =మూడేళ్లుగా రికవరీలో రాష్ట్రంలోనే సైబరాబాద్‌ది మొదటి స్థానం   
 =ఈ సారి కూడా నెంబర్ వన్ కోసం కసరత్తు

సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ అనగానే పోలీసు అధికారులకు టెన్షన్.... పెండింగ్ కేసులతో పాటు రికవరీ అయిన చోరీ సొత్తు వివరాలను ఈనెలాఖరులో వెల్లడించాల్సి ఉండటమే దీనికి కారణం. వరుసగా మూడేళ్ల నుంచి చోరీ సొత్తు రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్న సైబరాబాద్ పోలీసులు ఈ ఏడాది కూడా ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో అన్ని ఠాణాల ఇన్‌స్పెక్టర్లు రికవరీ టెన్షన్‌లో ఉన్నారు. పాత, కొత్తనేరస్తుల ఆచూకీ కోసం ఓవైపు గాలిస్తూనే..  మరోవైపు దొరికిన వారి నుంచి సొత్తు రికవరీ చేసే పనిలో పడ్డారు.

గతనెలలో మియాపూర్ ఠాణా ముందు పాతనేరస్తుడు విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేపథ్యంలో పట్టుపడ్డ దొంగల విచారణలో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  2010లో రూ.14.52 కోట్లు చోరీ సొత్తు రికవరీ చేయగా.... 2011లో రూ.19.42 కోట్లు, 2012లో రూ.19.32 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఏడాది కూడా రికవరీని పెంచి తిరిగి మొదటి స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నతాధికారులున్నారు.  దొంగను పట్టుకోవడం ఒకెత్తై.. అతడి నుంచి చోరీ సొత్తు రాబట్టడం పోలీసులకు మరో సవాల్‌గా మారుతోంది.

ఈ సమయంలో ఏ చిన్నపొరపాటు జరిగినా కేసు మొత్తం తారుమారయ్యే ప్రమాదం ఉంది. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఏడునెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ వచ్చీరాగానే నేరాలు, ఘోరాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సమర్థవంతంగా నేరాలను అదుపు చేశారు.  అభయలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఐటీ కారిడార్ పోలీసింగ్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు చోరీల అదుపుకు కృషి చేస్తూనే.. చోరీ సొత్తు రికవరీపై దృష్టి సారించారు.

సైబరాబాద్ పరిధిలోని అన్ని శాంతిభద్రతల ఠాణాల పరిధిలో ఎంత సొత్తు చోరీ అయింది? రికవరీ ఎంత అనే దానిపై ఆరా తీశారు.  రికవరీ తక్కువ చేసిన అధికారులకు టార్గెట్ విధించడంతో ఆగమేఘాలపై ఇన్‌స్పెక్టర్లు.. దొంగల కోసం గాలింపు చేపట్టారు. మరోపక్క పట్టుబడ్డ దొంగల నుంచి సొత్తు రికవరీ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు.

ముందు నుంచే చోరీ సొత్తుపై దృష్టి పెట్టిఉంటే ఏడాది చివరి(డిసెంబర్)లో ఇన్‌స్పెక్టర్లు టెన్షన్ తీసుకుకోవాల్సిన పనిలేకుండా ఉండేదని అధికారులంటున్నారు.గతేడాది చోరీ సొత్తు రికవరీలో మొదటి పది స్థానాల్లో ఇబ్రహీంపట్నం, నాచారం, రాయదుర్గం, శివరాంపల్లి, మహేశ్వరం, అల్వాల్,  కీసర, మంచాల్, హయత్‌నగర్, రాజేంద్రనగర్ ఠాణాలు నిలిచాయి. ఈసారి కూడా టాప్‌టెన్‌లో ఉండేందుకు ఆయా ఠాణాల ఇన్‌స్పెక్టర్లు కృషి చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement