కష్టమే! | Sakshi
Sakshi News home page

కష్టమే!

Published Sat, Nov 8 2014 12:14 AM

కష్టమే!

మేయర్ ప్రకటనపై ప్రజల్లో ఆశలు
ఒప్పుకోని నిబంధనలు
ఆస్తి పన్ను రద్దుపై మల్లగుల్లాలు
చట్ట సవరణ చేయాలంటున్న  నిపుణులు

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇళ్లకు రూ.4 వేల లోపు ఆస్తిపన్ను రద్దుకు స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది అమల్లోకి వస్తే  1200 చ.అడుగుల ఇళ్లున్న వారు సైతం ఆస్తిపన్ను చెల్లించాల్సిన పని ఉండదు. ఈ లెక్కన పలువురు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారు సైతం ఆస్తిపన్ను చెల్లించాల్సిన పని ఉండకపోవచ్చు.ఇక్కడే సమస్య ఎదురవుతోంది. ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది.

అడ్డుగా నిబంధనలు

జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనలను పరిశీలిస్తే...మేయర్ ప్రకటించినట్లుగా చేయాలంటే యాన్యువల్ రెంటల్ వేల్యూ దాదాపు రూ.7500 వరకు ఉన్న నివాస భవనాలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని అధికారి ఒకరు చెప్పారు. దీన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. మినహాయింపునకు అవకాశం కల్పించినప్పటికీ.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం స్థానిక సంస్థకు (జీహెచ్‌ఎంసీకి) గ్రాంట్‌గా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది కూడా యజమానులు నివసిస్తున్న ఇళ్లకే వర్తిస్తుంది. అద్దెకిచ్చే ఇళ్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పారు.

రావాల్సిన వాటాలే లేవు

జీహెచ్‌ఎంసీకి వివిధ పథకాలు.. ప్రాజెక్టులకే ఎంతోకాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. వృత్తి పన్ను, మోటారు వాహన పన్ను వాటా, ఆక్ట్రాయ్ పన్నుల్లోనూ అరకొరగానే విదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ గ్రాంట్‌గా ఏటా దాదాపు రూ.400-500 కోట్లు ఇవ్వడం అసాధ్యమని  నిపుణులు చెబుతున్నారు. పన్ను మినహాయింపుతో జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ. వందకోట్ల ఆదాయమే తగ్గుతుందని... ఇతరత్రా పన్నులు... పటిష్ట చర్యలతో లోటును పూడ్చుకుంటామని మేయర్ మాజిద్ అంటున్నారు. అయితే రూ.4వేల లోపు ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల ద్వారా వచ్చే

ఆదాయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసినట్లు లేదని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆస్తిపన్ను కట్టాల్సిన పని లేదని భావిస్తున్న నగర ప్రజల ఆశ ఫలించేలా కనిపించడం లేదు. వసూళ్లపై దెబ్బ: జీహెచ్‌ఎంసీలో గత ఆర్థిక సంవత్సరం రూ.1000 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం దాన్ని రూ.1500 కోట్లకు పెంచడం...టౌన్‌ప్లానింగ్ ఫీజులు, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలనేది కమిషనర్ సోమేశ్‌కుమార్ లక్ష్యం. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్ల టార్గెట్ దాదాపు రూ.5000 కోట్లు. ఇప్పటి వరకు రూ.దాదాపు రూ.450 కోట్లు ఆస్తిపన్ను వసూలై ంది. మేయర్ ప్రకటనతో ఆస్తిపన్ను వసూళ్లు తగ్గే ప్రమాదం ఉందని జీహెచ్‌ఎంసీ వర్గాల అంచనా.
 
స్మార్ట్‌గా వసూళ్లు..
 
ఇటీవల ముగిసిన మెట్రో పొలిస్ సదస్సులో ఆయా నగరాలు అనుసరిస్తున్న తీరు ఇచ్చిన స్ఫూర్తితో.. కాగిత రహిత పాలన (ఈ-ఆఫీస్) చేయాలనుకున్న జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లలోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. బిల్ కలెక్టర్లు, తదితరులకు టాబ్లెట్ పీసీలు ఇస్తున్నారు. భవనం ఫొటోనూ ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. తద్వారా కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు సైతం ఏరోజు .. ఎవరు.. ఎక్కడ వసూలు చేశారనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. సమయంతో సహా టాబ్లెట్‌లో నమోదు కానుండటంతో పని దొంగలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.

ఎగ్గొడితే అంతే...

మరోవైపు పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. ఏ భవనం నుంచైనా ఆస్తిపన్ను వసూలు కాని పక్షంలో.. తద్వారా జీహెచ్‌ఎంసీకి కలిగే నష్టం మొత్తాన్ని సంబంధిత ఉద్యోగి నుంచే వసూలు చేయవచ్చని చట్టంలో  ఉంది. పని చేయని వారిపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. లేని పక్షంలో విధుల నుంచి తప్పుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. లక్ష్యాల్లో కేవలం 2 శాతమే చేసిన పలువురిని శుక్రవారం తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. కొందరు బిల్‌కలెక్టర్లనూ సస్పెం డ్ చేశారు. మరోవైపు బాగా పనిచేసేవారికి ప్రోత్సాహకాలనూ రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా వివిధ పద్ధతుల ద్వారా రూ. 5వేల కోట్లు  ఆదాయం తేవాలనేది లక్ష్యం కాగా.. ఆస్తిపన్ను మినహాయింపు ప్రకటనతో దానికి గండి పడిందని భావిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఊరుకున్నారేం...

కొద్దిరోజుల్లో పాలకమండలి గడువు ముగుస్తోంది. ఈ సమయంలో చేసిన ఈ ప్రకటనను కనీసం ఆర్నెళ్లముందో.. లేక ఏడాది ముందో ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేయర్  ప్రకటన వెనుక ఇతరత్రా కారణాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement