మహిళను వేధిపులకు గురిచేస్తున్న లాయర్ ఒకరు 'షీ' టీమ్ కు చిక్కారు.
హైదరాబాద్: మహిళను వేధిపులకు గురిచేస్తున్న లాయర్ ఒకరు 'షీ' టీమ్ కు చిక్కారు. ఢిల్లీకి చెందిన మహిళను వేధిస్తున్న ఎం అభిషేక్(38) అనే న్యాయవాదిని అరెస్ట్ చేసినట్టు పోలీసు అదనపు కమిషనర్ స్వాతి లక్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బర్కత్ పురాకు చెందిన నిందితుడు జనవరిలో గచ్చిబౌలిలో జరిగిన ఐఐఎఫ్‌ఏ ఉత్సవానికి హాజరయ్యాడు. ఇదే ఉత్సవానికి ఢిల్లీ నుంచి వచ్చిన మహిళను అభిషేక్, అతడి స్నేహితుడు పరిచయం చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము మీడియాకు చెందిన వారిమని, తమతో స్నేహంగా చేయాలని కోరగా ఆమె తిరస్కరించింది.
అప్పటి నుంచి ఆమెకు మెసేజ్ లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన స్నేహితులతో అతడిని ఫోన్ లో హెచ్చరించింది. తనకు మెసేజ్ లు పంపడం మానుకోవాలని హితవు పలికింది. అయినా అభిషేక్ వేధింపులు ఆగకపోవడంతో 'షీ' టీమ్ ను ఆశ్రయించింది. అతడిని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.