రాష్ట్ర ఉద్యానవన శాఖ సవరణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఉద్యానశాఖ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యానవన శాఖ సవరణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో సమీకృత ఉద్యానాభివృద్ధి ప్రాజెక్టు(ఎంఐడీహెచ్)కు రూ. 67.50 కోట్లు కేటాయించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఉద్యాన శాఖ రూ. 81 కోట్లకు ప్రతిపాదనలు పంపింది. అయితే, కేంద్రం వాటా 85 నుంచి 60 శాతానికి తగ్గింది. దీంతో రూ. 81 కోట్లకు పంపిన ప్రతిపాదనలను రూ. 67.50 కోట్లకు సవరించి కేంద్ర ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది. కేంద్రం వాటా రూ.40.50 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.27 కోట్లు. నిధులు తగ్గడంతో ఉద్యాన పథకాలకు కూడా నిధులు తగ్గించాల్సి వచ్చింది.
సవరణ ప్రణాళిక ప్రకారం అత్యధికంగా కోల్డ్ స్టోరేజీలకు రూ. 12.79 కోట్లు కేటాయించారు. ఒక్కో కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నులు. గరిష్టంగా రూ. 1.40 కోట్లు కేటాయిస్తారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 11 యూనిట్లకు అనుమతి ఇచ్చారు.