తుకారాంగేట్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై ఇనుపరాడ్డుతో దాడికి దిగాడు.
అడ్డగుట్ట (హైదరాబాద్): తుకారాంగేట్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై ఇనుపరాడ్డుతో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్‌కు చెందిన ఐతే రామ్‌కుమార్(46) సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించిన రామ్‌కుమార్ సమీపంలో ఉన్న నలుగురిపై దాడి చేశాడు.
అదే విధంగా ఇనుపరాడ్డు పట్టుకొని పలువురు స్థానికులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడితో సునీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సైకో రామ్‌కమార్‌కు కూడా పలు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు.