విలువైన పార్కు స్థలం కబ్జాకు గురైంది. అయినా అధికారులు పట్టించుకో పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెం.10లోని ఐఏఎస్.
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: విలువైన పార్కు స్థలం కబ్జాకు గురైంది. అయినా అధికారులు పట్టించుకో పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెం.10లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఎదురుగా ఇన్‌కమ్ ట్యాక్స్ క్వార్టర్స్‌ను ఆనుకొని ఉన్న కృష్ణాపురం కాలనీలో విలువైన పార్కు స్థలం కబ్జాకు గురైంది. కాలనీ లేఅవుట్‌లో చూపించిన సుమారు 2500 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక బోర్డును తొలగించి అధికారులకు సవాలు విసిరారు.
1990లో కాలనీ ఏర్పడప్పుడు 0.52 సెంట్ల స్థలాన్ని రిక్రియేషన్ జోన్ కింద వదిలి పార్కుగా అభివృద్ధి చేసేందుకు తలపెట్టారు. ఈ మేరకు ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థలం కబ్జాకు గురవుతుందని పత్రికల్లో రావడంతో లోకాయుక్త సుమోటో (4/2013/బీ1)గా స్వీకరించి, గత ఫిబ్రవరి 21న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఆరు నెలల్లో ఈ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 అధికారులు ఈ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి.. అతిక్రమిస్తే శిక్షార్హులంటూ బోర్డు ఏర్పాటు చేశారు.
అయితే, ఈ నెల 13న రాత్రి ఈ బోర్డును తొలగించడానికి కబ్జాదారులు రాగా, అక్కడే ఉన్న వాచ్‌మెన్ అడ్డుకోవడానికి యత్నించి విఫలమయ్యాడు. స్కార్పియోలో వచ్చిన ఏడుగురు దౌర్జన్యంగా బోర్డును తొలగించారు. దీనిపై కాలనీవాసులు ఫిర్యాదు చేయగా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ స్థలంలో తనిఖీలు చేశారు. అయితే, తదుపరి చర్యలు తీసుకోక పోవడంతో స్థానికులు అధికారులను నిలదీశారు.
ఈ స్థలాన్ని పార్కు నుంచి రెసిడెన్షియల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొనడంతో కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. పార్కును నివాసిత ప్రాంతానికి ఎలా మారుస్తారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కబ్జాను పార్కు స్థలానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కబ్జాదారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మళ్లీ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.