‘పాలమూరు’ 47,670 కోట్లకు సవరణ | 'Palamuru' to amend Rs 47,670 crore | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ 47,670 కోట్లకు సవరణ

Apr 24 2017 1:54 AM | Updated on Mar 22 2019 3:19 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది.

- రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు
- ప్రభుత్వం ఆమోదిస్తే రూ.12,470 కోట్ల మేర వ్యయం పెరిగే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది. పలు మార్పులు, కొత్త నిర్ణయాలు, వాటికి అనుగుణం గా పెరిగిన కాల్వల పొడవు.. వంటి కారణాలతో ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి  రూ.47,670 కోట్లకు చేరనుంది. ఈ  వ్యయానికి గాను సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నీటి పారు దల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఈ వినతిని అంగీకరిస్తే ప్రాజెక్టుపై వ్యయ భారం రూ.12,470 కోట్ల మేర పెరగనుంది. పెరిగే అంచనాలపై ప్రభుత్వ పరిశీలన తర్వాత సవరించిన అంచనాలతో ఉత్తర్వులు జారీ అవుతాయని నీటి పారుదల శాఖలోని ఉన్నత స్ధాయి వర్గాలు తెలిపాయి.

డిజైన్‌ మారడంతో అనివార్యమైన పెంపు..
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల వరద జలాలను తీసుకొని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 2.70 లక్షల ఎకరాలు, నల్లగొండలోని 30 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా ఈ పథకాన్ని రూ.35,200 కోట్లతో చేపట్టారు. దీనికోసం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వా యర్లతో పాటు 5 లిఫ్టులను ప్రతిపాదించారు. అందుకనుగుణంగా డిజైన్లు ఖరారు చేసి నార్లాపూర్‌ నుంచి ఉద్ధండాపూర్‌వరకు 18 ప్యాకేజీలతో రూ.29,333 కోట్లకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. అయితే ప్రాజెక్టు మొదలు పెట్టే సమయానికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా డిజైన్‌లో అనేక మార్పులు చేస్తూ వచ్చింది.

గత ఏడాదే ప్రతిపాదనలు..
నిజానికి గత ఏడాదిలోనే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అది ముందుకు వెళ్లలేదు. అయితే ప్రస్తుతం మిగతా పనులు చేపట్టాలంటే సవరించిన అంచనా వ్యయాలకు ఆమోదం తప్పనిసరి కావడంతో అందుకు అనుగుణంగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. అక్కడ ఆమోదం దక్కిన పక్షంలో సవరించిన అంచనాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement