ఇప్పటి దాకా హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీలపై మాత్రమే ప్రకటనల పన్ను వసూలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ త్వరలోనే బస్సులు, వ్యాన్లు, క్యాబ్స్, ఆటోలపై ప్రదర్శించే ప్రకటనలకు సైతం పన్నును వసూలు చేయనుంది.
- సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
- ఏప్రిల్ నుంచి వసూలుకు చర్యలు
- {పజలపైనా పెరగనున్న భారం
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి దాకా హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీలపై మాత్రమే ప్రకటనల పన్ను వసూలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ త్వరలోనే బస్సులు, వ్యాన్లు, క్యాబ్స్, ఆటోలపై ప్రదర్శించే ప్రకటనలకు సైతం పన్నును వసూలు చేయనుంది. దీని ద్వారా ఏటా రూ. 25 - 30 కోట్ల మేర ఆదాయం రాగలదన్నది అధికారుల అంచనా. గ్రేటర్‌లో తిరిగే వివిధ రకాల వాహనాల్లో దాదాపు మూడు లక్షల వాహనాలపై ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. వాటి నుంచి ప్రకటనల పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు.
శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ గ్రేటర్‌లో క్యాబ్స్ భారీగా పెరిగాయి. వాటితో పాటు బస్సులు, ఇతరత్రా వాహనాల రాకపోకలూ పెరిగాయి. వాటిల్లో చాలా వాహనాలపై వివిధ వాణిజ్య ఉత్పత్తుల ప్రకటనలుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ఏ రకంగా ప్రచారం నిర్వహించినా (వాహనాలు, బ్యాగులపై, కరపత్రాల ద్వారా, గోడలపైనా, ఇతరత్రా) ప్రకటన పన్ను వసూలు చేయవచ్చు. కానీ ఇంతవరకు పెద్దపెద్ద హోర్డింగులు, దుకాణాల ముందు బోర్డులపై ప్రకటనలకు మాత్రమే ప్రకటన పన్ను విధించిన జీహెచ్‌ఎంసీ తాజాగా వాహనాల ద్వారా కూడా బాగానే ప్రచారం జరుగుతోందని గుర్తించింది. వాటిపైనా ప్రకటనల పన్ను విధిస్తే ఖజానాకు లాభం కలుగుతుందని యోచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం (2014 ఏప్రిల్) నుంచి ఈ ప్రకటన పన్ను విధింపు అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
కేటగిరీలుగా పన్ను విధింపు..
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్, మెట్రోరైలు కారిడార్లలో ప్రకటనల ఏర్పాటుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేసి ఆయా మార్గాలను ప్రకటనల పన్ను వసూళ్లకు ఁస్పెషల్* (ఎస్) కేటగిరీ మార్గాలుగా గుర్తించింది. మిగతా జాతీయ, రాష్ట్ర రహదారుల మార్గాలను డిమాండ్‌ను బట్టి ‘ఏ’ కేటగిరీగా గుర్తించింది ప్రకటనల ఫీజును నిర్ణయించింది. వీటితోపాటు ఇప్పటికే ఉన్న హోర్డింగులు, బస్‌షెల్టర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలపై ప్రకటనల ఫీజుల్ని కూడా దాదాపు రెట్టింపు చేయనుంది.
గోడ పెయింటింగ్‌లకూ పన్ను పడుద్ది..
గోడలపై వేసే ప్రచార పెయింటింగ్‌లకు, దుకాణాల షట్టర్ల మీది ప్రచారాలకు సైతం ప్రకటనల పన్ను విధించనున్నారు. వీటితోపాటు గ్లాస్ పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులు, స్టిక్కర్లు, జెండాలపై ప్రచారాలు చేసినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.