హ్యాట్సాఫ్ | Modern technology, crime control | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్

Oct 29 2015 12:28 AM | Updated on Oct 22 2018 6:02 PM

హ్యాట్సాఫ్ - Sakshi

హ్యాట్సాఫ్

‘సర్ మొబైల్ ఇస్తానని నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు.

 సైబరాబాద్ పోలీసుల కృషి భేష్
వాట్సప్ ఫిర్యాదులకు తక్షణ స్పందన
ఆధునిక టెక్నాలజీతో నేరాల నియంత్రణ
సోషల్ మీడియాలో సిబ్బంది విధుల పర్యవేక్షణ

 
సిటీబ్యూరో: ‘సర్ మొబైల్ ఇస్తానని నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. భయమేస్తుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి’ జూన్ ఒకటిన సైబరాబాద్ పోలీసు వాట్సప్ నంబర్‌కు ఓ యువతి పంపిన సందేశం. ఆ అమ్మాయి పంపిన లోకేషన్ కుషాయిగూడ పరిధిలో ఉండటంతో అక్కడి ఇన్‌స్పెక్టర్‌కు కమిషనరేట్ సిబ్బంది ఈ సమాచారం చేరవేసి కొద్ది నిమిషాల్లోనే ఆమెని రక్షించారు. ‘దిల్‌సుఖ్‌నగర్ హాస్టల్‌లో ఉంటున్నా. ప్రతిరోజూ నా నంబర్‌కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. భరించలేని స్థాయికి చేరుకుంది. హెల్ప్ చేయండి ప్లీజ్’.. జూన్ 17న వాట్సప్‌కు ఓ అమ్మాయి సందేశం. షీ టీమ్ సభ్యులు మాటువేసి.. మరుసటి రోజే వేధిస్తున్న ఆకతాయిని పట్టుకున్నారు.

‘మాదాపూర్‌లోని శ్రీ సాయి కేశవ ఎన్‌క్లేవ్‌లో 13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. బాలికను రక్షించడి’ అంటూ ఆగస్టు 8న యువతి వాట్సప్‌లో సమాచారాన్ని చేరవేసింది. ఈ మేరకు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం అక్కడికెళ్లి బాలికను కాపాడి నిర్వాహకులను అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నంబర్ (9490617444)కు ఫిర్యాదు అందగానే సంబంధిత సమాచారాన్ని ఆ పరిధిలోని సిబ్బందికి చేరవేసి త్వరితగతిన కేసులు ఛేదించేలా చూస్తున్నారు. ఆపదలో ఉన్న అమ్మాయిలు, ప్రమాదంలో ఉన్న యువకులు.. ఏ సమస్య అయినా వాట్సప్‌కు మేసేజ్ చేస్తే కొన్ని నిమిషాల వ్యవధిలో సాయం అందుతోందని ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా..
వేధింపులు, భౌతిక దాడులు, అత్యాచార యత్నాలపై సైబరాబాద్‌లోని కొన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరించడం లేదన్న విమర్శలున్నాయి. చాలా కేసుల్లో బాధితులకు పోలీసుస్టేషన్లు అంటేనే నమ్మకం లేకుండా పోయింది. ఈ అపవాదును తొలగించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరయ్యేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నారు. వీటిని కమిషనరేట్‌లోని సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఫేస్‌బుక్ పేజీలో బాధితులు తమ ఫిర్యాదును పోస్ట్ చేయవచ్చు. వాట్సప్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పెట్టవచ్చు. ఇలా ఎవరైనా సరే ఫిర్యాదు లేదా ఏదైనా ఘటనపై సమాచారాన్ని పంపినా సంబంధిత ఠాణా పోలీసులకు చేరవేస్తున్నారు. అలాగే కమిషనరేట్ నుంచే నిర్వహిస్తున్న పీఎస్ ఫేస్‌బుక్ పేజీల్లోనూ బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు స్పందిస్తారు.

ఆన్‌లైన్‌లోనే ఆదేశాలు..
ఏ రోజుకారోజు పోలీసులు చేస్తున్న విధుల వివరాలను ఫొటోలతో సహా వివరించేందుకు ప్రత్యేకంగా గ్రూప్-1 (లా అండ్ ఆర్డర్), గ్రూప్-2 (క్రైమ్), గ్రూప్-3(ట్రాఫిక్) వాట్సప్ గ్రూప్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో మెంబర్‌గా ఉన్న సీవీ ఆనంద్.. సిబ్బంది కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని కూడా హెచ్చరిస్తున్నారు. ఃఛిఞఛిడఛ ట్విట్టర్ ఖాతాతోనూ కమిషనర్ కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
 
 
అలర్ట్ చేస్తున్నాం..
నెలరోజుల క్రితం ఓ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించినప్పుడు ఆ సమాచారాన్ని కమిషనరేట్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. జనాలను అప్రమత్తం చేశాం. అలాగే రోజూ కమిషనరేట్‌లో జరిగే కార్యక్రమాలు, అలర్డ్ మెసేజ్‌లతో పాటు నేరాల బారిన పడుతున్న ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వివిధ అంశాలతో కూడిన ఆర్టికల్స్ రోజువారీగా మా సిబ్బంది పోస్ట్ చేస్తున్నారు. వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ వల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తున్నాం.
 - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
 
వాట్సప్‌కు అందిన ఫిర్యాదులు..

సౌండ్ పొల్యూషన్ (118), న్యూసెన్స్ (202),  రాంగ్ పార్కింగ్ (61),
సిగ్నల్ జంప్స్ (29),
ట్రాఫిక్ జామ్స్ (118),
ప్రమాదాలు (37), సలహాలు (113)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement