యూట్యూబ్‌లో 'మైమ్' వీడియోల హల్ చల్ | mime videos halchal in youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో 'మైమ్' వీడియోల హల్ చల్

Published Sun, Jul 12 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

mime videos halchal in youtube

పాత కొత్త పాటల మిక్స్‌తో గిమ్మిక్స్
మైమ్ త్రూ టాలీవుడ్, బాహుబలితో సిటీగాళ్స్ సందడి

 
సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: కదలని కారులో కుదురుగా ఉండని నాటీగాళ్స్.. నేపథ్యంలో పాటలు.. ఆ పాటలకు పెదాల నుంచి పాదాల దాకా కదుపుతూ వారి అభినయ నర్తనం... పల్లవుల వరకూ మాత్రమే వినిపించే ఆ హిట్‌సాంగ్స్ వరుసగా మారిపోతుంటాయి. అందుకు అనుగుణంగా అమ్మాయిల గెటప్స్ కూడా. కొన్ని నిమిషాల పాటు అలనాటి  మెలొడీల నుంచి ఈ నాటి కొత్త ట్రెండీల వరకు అన్నింటినీ కిచిడీ చేసేసి, మనల్ని కదిపేసి కుదిపేస్తారు. ఇదీ ఆన్‌లైన్ సాక్షిగా ఉర్రూతలూగిస్తున్న మైమ్ వీడియోల సంక్షిప్త స్టోరీ. సిటీ అమ్మాయిలు సైతం చేస్తున్న ట్రెండీ సవారీ..
 
'అహ నా పెళ్లి యంట... ఓహొ నా పెళ్లి యంట' పాట నుంచి 'సూపర్ మచ్చి' దాకా.. దాదాపు 16 పాటల్ని కలిపి కుట్టేసి, వెరైటీ వీడియోతో హిట్ కొట్టేశారు నగరానికి చెందిన 'యోయో గాళ్స్'. అంతేనా.. తెలుగు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న బాహుబలి మేనియాకు తగ్గట్టుగా ఆ సినిమా పాటలకూ నర్తించేసి వహ్వా.. అనిపించేస్తున్నారు. వీరి బాటలోనే మరికొందరు తెలుగమ్మాయిలు క్రియేట్ చేసిన మరో వీడియో సైతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఎలాంటి ప్రొఫెషనల్ బ్యాగ్రవుండ్ లేకుండా అకస్మాత్తుగా లైమ్‌లైట్‌లోకి దూసుకొచ్చేసిన ఈ అమ్మాయిలు ఎవరు? ఎలా మొదలు పెట్టారు?..
 
ఇలా అనుకున్నారు.. అలా పూర్తి చేసేశారు
'బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి ఆగస్టులో అమెరికా వెళుతున్నా. ఈలోగా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాను. షార్ట్‌ఫిల్మా.. ఇంకా ఏదైనా.. అని ఆలోచిస్తుంటే ఎవరో ఫ్రెండ్ 'మైమ్ త్రూ టైమ్' అనే హాలీవుడ్ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అది చూశాక.. చాలా బావుందనిపించింది. సెర్చ్ చేసుకుంటూ వెళితే బాలీవుడ్, ఇతర భాషల్లోనూ ఇలాంటి వీడియోలు ఉన్నాయని, అయితే తెలుగులో మాత్రం లేవని తెలిసింది. అప్పుడే ట్రై చేద్దామనే ఆలోచన వచ్చింది' అంటూ చెప్పింది హిమాయత్‌నగర్  నివాసి కావ్య.

ఈ ఆలోచన వచ్చిందే తడవుగా మియాపూర్‌లో నివసించే తన కాలేజ్ క్లాస్‌మేట్ శృతి, యూసఫ్‌గూడ సెయింట్ మేరిస్‌లో డిగ్రీ సెకండియర్ చదువుతున్న తన కజిన్ కమ్లిలను కదిలించింది. వాళ్లిద్దరూ ఓకే చెప్పడంతో తన ఐడియాను 'ట్రాక్' ఎక్కించింది. 'శృతికి భరతనాట్యం, నాకు సినిమా డ్యాన్సులు వచ్చు. ఇద్దరికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం ఉండడం కలిసొచ్చింది' అంటూ వివరించింది కావ్య. దాదాపు 60 ఏళ్ల నాటి పాత పాటల నుంచి ఆర్నెళ్ల క్రితం వచ్చిన కొత్త పాటల వరకూ తమ తొలి మైమ్ త్రూ టాలీవుడ్‌లో గుదిగుచ్చారీ మిత్రత్రయం.

‘ఇంగ్లిషు వాళ్లు సింగర్స్‌ని, బాలీవుడ్‌లో సినిమాలని తీసుకుంటే, మేం ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి.. ఇలా  హీరోల వారీగా తీసుకుని చేశాం. పాత పాటల్ని ఎంచుకోవడంలో అమ్మ హెల్ప్ చేసింది' అంటూ గుర్తు చేసుకుంది కావ్య. పాటల సెలక్షన్ అయిపోయాక, ఫ్రెండ్ కెమెరా తీసుకుని తమ కార్ షెడ్లోనే జైలో కారులో షూట్ చేశారు. ప్రాక్టీస్‌కి 3 గంటలు, షూటింగ్‌కి 7 గంటలు మొత్తం 10 గంటల్లో చిత్రీకరణ పూర్తయింది. తర్వాత రోజే యూ ట్యూబ్‌లో పెడితే.. రెండు వారాల్లోనే హిట్స్ లక్ష దాటేశాయి. 'ఎడిటింగ్‌లో మా ఫ్రెండ్ రాకేష్‌కి ఉన్న అనుభవం  కెమెరా వర్క్‌ను అనూష, శిరీషలు సరిదిద్దడంతో మా పని మరింత ఈజీ అయింది. ఇక డ్యాన్స్‌కి పెద్దగా చేసిందేమీ లేదు. అంతా ఆన్‌స్పాట్ కొరియోగ్రఫీ. మా సొంత దుస్తులే వినియోగించాం.

అయితే పాత పాటలకి ఎక్స్‌ప్రెషన్స్ కాస్త కష్టమైంది' అంటూ నవ్వేస్తున్న ఈ యోయో గాళ్స్.. ఇటీవలే 'బాహుబలి' పాటలతో మరో వీడియోను తీసి అప్‌లోడ్ చేసేశారు. ఇదీ హిట్టే. 'నెక్ట్స్ ఏమిటి?.. అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఫుల్ క్రేజ్ కదాని బాహుబలి చేశాం. ఈ సినిమాలోని థీమ్ బిట్ తప్ప అన్ని పాటలకు నర్తించాం. దీనికి కూడా మంచి రెస్పాన్సే వస్తోంది' అంటూ వీరు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న తరహా కాన్సెప్ట్స్‌తో వీక్షకుల్ని అలరిస్తామంటున్నారు. 'మీ నుంచి చాలా వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం'  అంటూ పలువురు అడుగుతున్నారని, దర్శకుడు మారుతి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఈ క్యూట్ గాళ్స్ చెబుతున్నారు.
 
స్కెచ్‌షీతో శ్రీకారం..
మూణ్నెళ్ల క్రితం ఆస్ట్రేలియన్ కామెడీ గ్రూప్ 'స్కెచ్ షి.. మైమ్ త్రూ టైమ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది.. అందులో గ్రూప్ మెంబర్స్ షాలీ, మాడిసన్, ల్యానా.. ముగ్గురూ దశాబ్దాల క్రితం నాటి పాపులర్ ఇంగ్లిష్ ట్రాక్స్‌కి పెదాలు కదుపుతూ గెటప్స్ మారుస్తూ ఉన్న చోటే నృత్యం చేస్తూ కనువిందు చేశారు. మొత్తం ఒక కారులో సాగిన ఈ నృత్యాభినయ హేల యూ ట్యూబ్‌లో దాదాపు 2 కోట్లకు పైగా వీక్షకులను సంపాదించి రికార్డ్ సృష్టించింది.
 


భారత్‌కు తెచ్చిన బెంగళూరు భామలు
'స్కెచ్‌షీ' వీడియోను స్ఫూర్తిగా తీసుకున్న బెంగళూరు బృందం మైమ్ త్రూ బాలీవుడ్ రూపొందించింది. 'ఈనా మీనా ఢీకా' నుంచి దేశీగాళ్  దాకా దమ్ మారో దమ్ నుంచి కొలవరి డి దాకా... ఇందులో కలిపి కొట్టారు. ఈ సందడిని కారు బయట నుంచి ఐఫోన్‌తో శ్యామ్ మోహన్ చిత్రీకరిస్తే.. ప్రీతా పెరీరా కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్టైలిస్ట్ మిథిలేష్ 14 రకాల కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ఒక్కరోజులోనే ఈ వీడియోకి 3 లక్షల హిట్స్ వచ్చాయి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శిల్ప జోహార్, ఇటీవలే కాలేజ్ చదువు ముగించుకున్న కవలలైన టీనా, టెస్సా వెల్లెరాలు నర్తనాభినయం చేశారు. (టీనా, టెస్సా షాహిద్ హీరోగా వచ్చిన 'షాందార్' హిందీ చిత్రంలో నటించారు). బాలీవుడ్ పాటల వీడియో హిట్‌ను అనుసరిస్తూ పంజాబీ, బెంగాలీ, మళయాళీ.. ఇలా వరుసగా పలు భాషలకు చెందిన మైమ్స్.. పుట్టుకొచ్చేస్తున్నాయ్.
 
డి టౌన్ గాళ్స్..
ఒక్క వీడియోతో పాపులరైపోయిన ఈ స్నేహత్రయానికి ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఫాలోవర్స్ కూడా వచ్చేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని మరో ముగ్గురు తెలుగమ్మాయిలు స్వప్నిక, రవళి, వర్షిణిలు ఇదే తరహా వీడియో తీసి 'టాలీవుడ్ టైమ్ మెషీన్' పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే అదీ దాదాపు 90 వేల హిట్స్‌ను చేరుకోవడం విశేషం. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టేందుకు కారణాలు అసలే లేవు. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అమ్మాయిల నృత్యాభినయాలకు పెద్దపీట వేస్తున్న ఈ తరహా వీడియోల ట్రెండ్ సిటీలో మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement