ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వారోత్సవాలు వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది.
ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వారోత్సవాలు వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన వారోత్సవాల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. రోజుకు సగటున 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించారు. వారికి రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్) ప్రత్యేకతలతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. స్టాల్‌ను సందర్శించిన సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన పరిశ్రమల ప్రతినిధులతోపాటు, ఎయిర్‌బస్, సిప్లా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. స్టాల్‌ను సందర్శించిన సంస్థల వివరాలు సేకరించిన పరిశ్రమల శాఖ.. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న 25 సంస్థల జాబితాను సిద్ధం చేశారు. గురువారం జరిగే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు.