
సాక్షి, హైదరాబాద్: నూతన ఏడాదిని పురస్కరించుకొని పోలీసు, అగ్నిమాపక, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, విజిలెన్స్, ఏసీబీ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం జీవోను విడుదల చేసింది. ప్రతిష్టాత్మకంగా భావించే తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం నలుగురిని వరించింది. ఈ అవార్డును టీఎస్‌ఎస్పీ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ యారబట్టి శ్రీనివాసరావు, టీఎస్ ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కిరణ్ రాయ్, అఫ్జల్‌గంజ్ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాది ప్రవీణ్ కుమార్, శంషాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ ఎస్‌ఐ కొక్కాడ బాలరాజు దక్కించుకున్నారు.
పోలీసు, అగ్నిమాపక శాఖ విభాగాల్లో 11 మందికి శౌర్య పతకం, ఇద్దరికి మహోన్నత సేవా పతకం, 37 మందికి ఉత్తమ సేవా పతకం, 21 మందికి కఠిన సేవా పతకం, 165 మందికి సేవా పతకం దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 15 మందికి సేవా పతకాలు వరించాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ విభాగంలో ఆరుగురికి శౌర్య పతకం, ఒకరికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సేవా పతకం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇద్దరికి సేవా పతకాలు దక్కాయి. ఏసీబీలో ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 12 మందికి సేవా పతకాలు వచ్చాయి.