‘కల్లు’ తెరవక ముందే... | liquor Dons are focus on Toddy stores | Sakshi
Sakshi News home page

‘కల్లు’ తెరవక ముందే...

Sep 24 2014 1:22 AM | Updated on Sep 4 2018 5:15 PM

‘కల్లు’  తెరవక ముందే... - Sakshi

‘కల్లు’ తెరవక ముందే...

గీత కార్మికుల కల్లు దుకాణాలు ఇంకా తెరచుకోకముందే బడా కాంట్రాక్టర్లు కన్నేశారు. వీరిలో రాజకీయ నేతలు, నగర బహిష్కారానికి గురైన లిక్కర్‌డాన్‌లు ఉండడం సంచలనం సృష్టిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో:  గీత కార్మికుల కల్లు దుకాణాలు ఇంకా తెరచుకోకముందే బడా కాంట్రాక్టర్లు కన్నేశారు. వీరిలో రాజకీయ నేతలు, నగర బహిష్కారానికి గురైన లిక్కర్‌డాన్‌లు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. గీత కార్మికుల జీవనోపాధికి ఆదరువుగా నిలుస్తుందన్న ఉద్దేశంతోతెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు పె(గ)ద్దల కడుపు నింపుతుండడం అందరినీ కలచివేస్తోంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు నగర శివారుల్లో గతంలో మూతపడిన 119 కల్లు దుకాణాలు దసరాకు (అక్టోబరు 3న) తెరచుకోనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని దుకాణాల్లో సింహభాగం వాటాలు దక్కించుకోవడంతోపాటు మరికొన్ని దుకాణాలను ఏకంగా హస్తగతం చేసుకునేందుకు బడా కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక కల్లు గీత కార్మిక సొసైటీలను నయానో భయానో తమ దారికి తెచ్చుకున్న వీరు.. ఏడాదికి వారికి కొంత మొత్తంలో చెల్లించి తాము మాత్రం అందినకాడికి దోచుకునేందుకు యత్నిస్తున్నారు.
 
పె(గ)ద్దల పంజా...
నగరంలో తెరుచుకోనున్న 119 కల్లు దుకాణాలను 43 సొసైటీలకు అబ్కారీ శాఖ అప్పజెప్పింది. ఒక్కో సొసైటీలో సుమారు 500 నుంచి 1500 వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో సొసైటీకి రెండు నుంచి మూడు చొప్పున దుకాణాలు కేటాయించింది. ఈ దుకాణాలను హస్తగతం చేసుకునేందుకు గతంలో అధికార పదవులు అనుభవించిన బడా రాజకీయ నాయకులు, లిక్కర్‌డాన్‌లు రంగంలోకి దిగారు. వీరు ప్రతి సొసైటీకి ఏడాదికి రూ.15 నుంచి రూ.25 లక్షల వంతున ఇస్తామని చెప్పి దుకాణాలను చేజిక్కించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక రోజువారీ నిర్వహణ, అబ్కారీ శాఖకు చెల్లించే ఫీజు పోను ఒక్కో కాంట్రాక్టరుకు ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు గిట్టుబాటు కానున్నట్లు సమాచారం.
 
ఇది మంచి లాభసాటి వ్యాపారం కావడంతో బడా కాంట్రాక్టర్లు అర్థబలం, అంగబలం, రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టర్లు కల్లు డిపోలను దక్కించుకుంటే గీత కార్మికులకు ఒరిగేదేమీ ఉండదన్నది బహిరంగ రహస్యమే. గతంలో కల్లు దుకాణాలు మూతపడిన సమయంలో రోడ్డున పడిన తమ సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోని నాయకులు, లిక్కర్ డాన్‌లు ఇపుడు కల్లు దుకాణాలను తమ ఖాతాలో వేసుకోవడం దారుణమని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వారి కనుసన్నల్లోనే...

నగరంలోని మలక్‌పేట్, కోమటికుంట, పురానాపూల్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలను హస్తగతం చేసుకునేందుకు ఓ కాంగ్రెస్ నాయకుడు, గతంలో కాంగ్రెస్ సర్కారులో కీలక పదవి అనుభవించిన ఓ నేత రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి, గోల్నాక, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, మాలకుంట, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలను గతంలో నగర బహిష్కారానికి గురైన లిక్కర్ డాన్ ఒకరు దక్కించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

టీడీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పురానాపూల్‌లో రెండు, ఆసిఫ్‌నగర్‌లో రెండు, ఉప్పుగూడ, లాల్‌దర్వాజ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలను వశం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించి ఇటీవలే సఫలీకృతుడైనట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లోని వాటితో పాటు మరిన్ని కలు ్లదుకాణాలు వీరి కనుసన్నల్లోనే మనుగడ సాగించే దురదృష్టకర పరిస్థితి తలెత్తడ ంతో గీత కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీరి కబంధ హస్తాల నుంచి కల్లు దుకాణాలను, గీత కార్మికులను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement