రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధనకు, అభివృద్ధి ఫలాలు బడుగు, బలహీనవర్గాలకు అందించేందుకు
అంబేడ్కర్ జయంతి సందర్భంగా లెఫ్ట్, ప్రజా సంఘాల నివాళి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధనకు, అభివృద్ధి ఫలాలు బడుగు, బలహీనవర్గాలకు అందించేందుకు అంబేడ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలసికట్టుగా ముందుకు సాగాలని వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. లాల్–నీల్ జెండాల ఐక్యతతోనే ప్రజలకు పోరాడే శక్తి వస్తుందని, దీని ద్వారా అధికారాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ నుంచి ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు వామపక్షాల నాయకులు, మేధావులు ర్యాలీ నిర్వహించారు.
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ర్యాలీలో ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావుతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, మల్లేపల్లి ఆదిరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, వి.శ్రీనివాసరావు, జి.రాములు, ఎన్.నర్సింహారెడ్డి, డీజీ నర్సింహారావు (సీపీఎం), వి.బాబు(ఎంసీపీఐ–యూ) పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం దోహదపడని ఆర్థిక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తమ్మినేని విమర్శిం చారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తోందని చాడ విమర్శించారు. పీడితులు, దళితులు ఏకం కావాల ని గద్దర్ పిలుపునిచ్చారు. వరంగల్ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, కాబోయే సీఎంగా కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని కంచ ఐలయ్య చెప్పారు. అంబేడ్కర్ ఆశయసాధనకు అందరు కలిసి పోరాడాలని, మంచి సమాజాన్ని నిర్మించాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.