ఇక ‘సహకార’ మద్యం

ఇక ‘సహకార’ మద్యం - Sakshi


రాష్ట్ర సర్కారు నిర్ణయం..

♦  వాటికి లెసైన్సు ఫీజు ఉండదు..

♦  మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధింపు!

♦  పదివేల చదరపు అడుగులున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతి.. జీవోలో స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అంటే.. గ్రామాలు, మండల, పట్టణాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు మార్కెటింగ్ సహకార సంఘాల్లోనూ మద్యాన్ని విక్రయించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వం అధీనంలో నిర్వహించాలనుకున్న పదిశాతం మద్యం దుకాణాలను సహకార సంఘాల్లోను, ప్రభుత్వ కా ర్పొరేషన్లలోను ఏర్పాటు చేయడానికి కమిషనర్ అనుమతించేందుకు నూతన మద్యం విధానంలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార సంఘాల్లో అనుమతించే మద్యం దుకాణాలకు లెసైన్సు ఫీజు ఉండదు. మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధిస్తారు.♦  షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది. పదివేల చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతమున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతించనున్నట్లు జీవో 218లో స్పష్టం చేశారు. ఇటువంటి షాపింగ్‌మాల్స్‌లో ఆ ప్రాంతం ఆధారంగా మద్యం దుకాణాలకున్న లెసైన్సు ఫీజును వసూలు చేస్తారు.

♦  ఒక్కో మద్యం దుకాణానికి లాటరీద్వారా మూడు దరఖాస్తులను తీస్తారు. దరఖాస్తుదారు లేకున్నప్పటికీ జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్టు జీవోలో స్పష్టం చేశారు. లాటరీలో తొలుత వచ్చిన దరఖాస్తుదారునికి మద్యం దుకాణం కేటాయిస్తారు. అదేసమయంలో మరో రెండు దరఖాస్తులను కూడా లాటరీద్వారా తీస్తారు. తొలుత వచ్చిన దరఖాస్తుదారు దుకాణం ఏర్పాటునకు ముందుకు రానిపక్షంలో రెండో దరఖాస్తుదారునికి అవకాశమిస్తారు. రెండో దరఖాస్తుదారూ రానిపక్షంలో మూడో దరఖాస్తుదారునికి దుకాణం కేటాయిస్తారు.

♦  లాటరీద్వారా తీసిన దరఖాస్తుదారుల కాలపరిమితి 90 రోజులుగా నిర్ధారించారు. అది దాటితే ఆ దరఖాస్తులకు విలువుండదు.

♦  షాపింగ్‌మాల్స్, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ కార్పొరేషన్లకు ఒకటికన్నా ఎక్కువ లెసైన్సులు మంజూరు అధికారం ఎక్సైజ్ కమిషనర్‌కు ఉంటుంది. గతంలో మద్యం దుకాణాల్లో విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేవి. ఇప్పుడు మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని గంట పెంచారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించారు.

 

కొత్త విధానానికి మంచి స్పందన..

ఇదిలా ఉండగా నూతన మద్యం విధానానికి జిల్లాల్లో మంచి స్పందన ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కొంతమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను రెండేళ్లకు బదులు ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే గతంలో ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి మద్యం దుకాణాలకోసం తీసుకుంటున్నారని, అందుకే ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top