కేసీఆర్ టీం రెడీ!

కేసీఆర్ టీం రెడీ! - Sakshi


తెలంగాణ సీఎస్‌గా రాజీవ్‌శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా టీపీ దాస్

 

* ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తయ్యాకే ఉత్తర్వులు

* కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం తప్పనిసరి

 *మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే పరిశీలన

 


 

సాక్షి, హైదరాబాద్:
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కార్యాలయ బృందం కూర్పు ను పూర్తి చేశారు. అధికారుల కేటాయింపుకు సంబంధించిన కసరత్తు మాత్రమే మిగిలింది. ప్రత్యేకించి కేం ద్ర సర్వీసు అధికారుల పంపిణీకి ప్రధాని ఆమోదం, కేంద్ర  మంత్రిత్వ శాఖల నుంచి కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం వంటి కసరత్తుకు  సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.

 

చురుగ్గా వ్యవహరించిన రాజీవ్‌శర్మ

రాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా రాజీవ్‌శర్మ నియుక్తులు కానున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈయన మన రాష్ట్ర కేడర్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. సీఎస్‌గా రాజీవ్‌శర్మకన్నా 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చందనాఖన్ పేరు బలంగానే వినిపించినా కేసీఆర్ చివరలో మనసు మార్చుకుని రాజీవ్‌శర్మ వైపే మొగ్గు చూపారు.

 

పైగా ఆమె నియామకానికి కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుపడవచ్చునని పలువురు ఐఏఎస్ అధికారులు కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. నాగిరెడ్డి, నర్సింగరావు పేర్లను కూడా పరిశీలించినా.. వారికి ఇప్పుడప్పుడే సీఎస్ కేడర్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని నర్సింగరావును తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. నాగిరెడ్డికి ఇంకేదైనా మంచి పోస్టు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్‌శర్మ పేరు ఖరారైంది. ఈయన కూడా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్‌కు చెందిన టీపీదాస్, అరుణ బహుగుణ పేర్లను కూడా కే సీఆర్ పరిశీలించారు. అయితే ప్రస్తుతం పోలీస్ అకాడమీ డీజీగా ఉన్న అరుణ బహుగుణ డీజీపీ పోస్టుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. ఇక టీపీ దాస్ కూడా సీనియరే అయినందున ఆయనను తెలంగాణ హోం ముఖ్యకార్యదర్శిగా కొనసాగిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి వచ్చారు.

 

 హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర కమిషనర్‌గా ప్రస్తుతం రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న 1986 బ్యాచ్ ఐపీఎస్ ఎం.మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఈయన నియామకంపై ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండబోవని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐజీ శివధర్‌రెడ్డి, యాంటీ నక్సలైట్ వింగ్ ఎస్‌ఐబీ చీఫ్‌గా సజ్జనార్ సేవలను వినియోగించుకోవాలని కే సీఆర్ నిర్ణయించారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం సీపీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖలోనే పనిచేస్తున్న గోపాల్‌రెడ్డిని కూడా తన బృందంలోకి ఎంపిక చేసుకున్నారు. తన ఓఎస్డీగా రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. అయితే సీఎస్, డీజీపీ పేర్లను మాత్రం గవర్నర్‌కు మౌఖికంగా తెలిపినట్లు తెలిసింది.

 

 అధికారిక కసరత్తు బాకీ

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ఐఏఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసు అధికారుల పంపిణీని ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇంకా పూర్తిచేయలేదు. ఈ కమిటీ ప్రతిపాదనలపై ప్రధాని మోడీ సంతకం చేశాక గానీ కసరత్తు పూర్తయ్యే అవకాశం లేదు. సోమవారం మోడీ ప్రమాణస్వీకారం పూర్తయ్యాకే ఆ ఫైల్ పరిశీలనకు వస్తుంది. పైగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నందున రాజీవ్‌శర్మ, గోపాలరెడ్డిలను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సీఎంవో కార్యదర్శిగా ఎంపిక చేసిన గోపాలరెడ్డి మధ్యప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు.

 

ఈయన్ని తెలంగాణకు డెప్యుటేషన్‌పై పంపించటానికి కూడా కేంద్ర ఆమోదం తప్పనిసరి. అలాగే ఓఎస్‌డీగా నియమితులయ్యే రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ప్రావిడెంట్ ఫండ్ ప్రాంతీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయననూ తెలంగాణ సర్వీస్‌కు డిప్యుటేషన్‌పై కేంద్రం ఆమోదం మేరకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నర్సింగరావు ఆ బాధ్యతల నుంచి రిలీవై, తెలంగాణలో చేరటానికి కనీసం నెలకుపైగా సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాకే వీరి నియామకాలపై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

ఢిల్లీకి కేసీఆర్


త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టనున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఆయన ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కూడా వెళ్లారు. మోడీతో సోమవారం కేసీఆర్ భేటీ కానున్నారు. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు వంటి వాటిపై సంబంధిత రంగాల ముఖ్యులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 హైదరాబాద్ కలెక్టర్‌తో భేటీ: ఇదిలా ఉండగా, కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనాను కలుసుకున్నారు. అరగంటసేపు ఆయనతో పలు అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు పలు వర్గాల నుంచి అభినందనల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపార సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు, తెలంగాణ జిల్లా ప్రజలతో కేసీఆర్ నివాసం ఆదివారం జనసంద్రాన్ని తలపించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముస్లిం, ధార్మిక సంఘాల నేతలు, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలు, అభిమానులు కేసీఆర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top