
నాన్‌కేడర్ అధికారులకు జేసీ పోస్టింగ్స్
కొత్త జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల పోస్టింగులకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జాయింట్ కలెక్టర్ల (జేసీ)
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు చోటు
ఒకే ఒక్క ఐఏఎస్ అధికారికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల పోస్టింగులకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జాయింట్ కలెక్టర్ల (జేసీ) కూర్పుతో కూడిన జాబితాకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోద ముద్ర వేశారు. ముందు నుంచి భావిస్తున్నట్లుగా రెవెన్యూ శాఖలోని సీనియర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకే ప్రాధాన్యం దక్కింది. ఒక్క జిల్లాకు మాత్రమే ఐఏఎస్ అధికారిని కేటాయించారు. మిగతా జిల్లాలన్నింటికీ నాన్ కేడర్ రెవెన్యూ అధికారులనే కేటాయించారు. జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివకుమార్ నాయుడును మహబూబ్‌నగర్ జేసీగా కరారు చేశారు.
మిగతా జిల్లాలకు 18 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 12 మంది ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జేసీలుగా 2014 బ్యాచ్ అధికారులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే వారిలో పలువురు సచివాలయంలో జాయింట్ సెక్రటరీలుగా, ఏటీడీఏ పీఓలుగా, పురపాలక శాఖలో కీలక పోస్టుల్లో ఉన్నారు. వారిని కదిలిస్తే ఆ పోస్టుల్లోకి నాన్ కేడర్ రెవెన్యూ అధికారులను నియమించాల్సి వస్తుంది. దీంతో నాన్‌కేడర్ అధికారులకే జేసీ పోస్టులివ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
చివరి వరకు టెన్షన్..
కొన్ని జిల్లాలకైనా తమకు అవకాశం కల్పించాలని గ్రూప్-1 అధికారులు చివరి వరకు కోరుతూ వచ్చారు. రెవెన్యూ అధికారులతో జాబితాను సిద్ధం చేసినందున ఆ పేర్లు మారకుండా చూసేందుకు రెవెన్యూ అధికారుల సంఘం నేతలు కూడా సచివాలయంలో చక్కర్లు కొడుతూ కనిపించారు. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అది అమల్లోకి తెచ్చి గ్రూప్-1 అధికారులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో జేసీలుగా నియమించాలనే డిమాండ్‌పై ఆ సంఘం నేతలు చివరి నిమిషంలో కాస్త మెత్తబడ్డారు.