తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం | Instant basin giving priority to projects | Sakshi
Sakshi News home page

తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Feb 16 2016 2:48 AM | Updated on Sep 3 2017 5:42 PM

తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

మార్చిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పూర్తిస్థాయి నిధులు
నీటి పారుదల శాఖ బడ్జెట్ సమీక్షలో మంత్రి హరీశ్  

 
 సాక్షి, హైదరాబాద్: మార్చిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 80 శాతానికి పైగా పూర్తయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీమ్, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ వంటి మధ్యతరహా ప్రాజెక్టులకు అవసరమయ్యేంత నిధుల కేటాయింపునకు నిశ్చయించింది. బడ్జెట్ ప్రతిపాదనలపై నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, సలహా దారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖకు ప్రతిపాదిత రూ.25వేల కోట్లను.. ప్రాజెక్టులకు ఏ రీతిన కేటాయింపులు జరపాలన్న దానిపై చర్చించా రు. హరీశ్‌రావు మాట్లాడుతూ... 2016-17 ఖరీఫ్ నాటికి నీళ్లివ్వగలిగే ప్రాజెక్టులకు నిధులివ్వాలన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్న మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించా రు. కొత్తగా చేపడుతున్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిడిహెట్టి, పెన్‌గంగ, సదర్‌మఠ్ ప్రాజెక్టులకు అవసరాల మేరకు వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్నారు.

 ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించండి..
 ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలని అధికారులకు హరీశ్ సూచించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పరిధిలోని క్యాంపు కాలనీల్లో ఖర్చు తగ్గిం చాలని, రోడ్లు, నీటి సరఫరా, ఇతర నిర్వహణలను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించాలని సూచించారు. ఇప్పటికే నాగార్జునసాగర్ పరిధిలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఎస్సారెస్పీ, జూరాలలోనూ అమలు చేయాలన్నారు. పనిలేని ప్రాంతాల్లో ఉన్న అధికారులు, వాహనాలను కొత్త ప్రాజెక్టుల పరిధిలోకి బదలాయించాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపం ఇవ్వడానికి తిరిగి ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement