‘మహా’ గిఫ్ట్‌..

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుమతినిచ్చిన లేఅవుట్‌లలో ‘గిఫ్ట్‌ డీడ్‌’ కింద వచ్చిన భూమిని ఈ నెలాఖరు నాటికి వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లానింగ్‌ విభాగం, ఎస్టేట్‌ విభాగ అధికారులు కలిసి ఆయా లేఅవుట్‌లను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 39 లేఅవుట్‌లలోని ప్లాట్లు, భూమికి జియో ట్యాగింగ్‌ పూర్తి చేశారు. మరో మూడు రోజుల్లో మిగతా ప్లాట్లకు ట్యాగింగ్‌ పూర్తి చేసి నెలాఖరు నాటికి ఈ–వేలం నోటిఫికేషన్‌ విడుదల చేసే దిశగా సన్నాహలు చేస్తున్నారు.

కబ్జాలకు చెక్‌.. కాసుల వర్షం
ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావడంతో గతంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలోని ప్లాట్లు, ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లు తొలుత వేలం వేయాలని భావించారు. కబ్జా కోరల్లో చిక్కుకుని ఖాళీగా ఉంటున్న గిఫ్ట్‌ డీడ్‌ భూములు విక్రయిస్తే ఇటు సంస్థకు ఆదాయం సమకూరడంతో పాటు సంరక్షించే ఒత్తిడి తగ్గుతుందని యోచించారు. కొన్నిచోట్ల కొంత మంది స్థలం అక్రమించిన సందర్భాలుండడంతో గిఫ్ట్‌డీడ్‌ భూములను అమ్మాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఆయా లేఅవుట్‌లలోని ప్లాట్లు, భూములకు జియో ట్యాగింగ్‌ పనులను వేగిరం చేశారు. కొన్ని ప్రాంతాల్లోని మూడెకరాల భూములను ఏకంగా విల్లాలు నిర్మించే అవకాశముండటంతో వారికే ఎక్కువ ధరకు విక్రయించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు.

‘ప్రభుత్వ జీఓ 33 నంబర్‌ ప్రకారం హెచ్‌ఎండీఏ అనుమతిచ్చిన లేఅవుట్‌లో మూడు శాతం, గేటెడ్‌ కమ్యూనిటీ, గ్రూప్‌ హౌసింగ్‌లోనైతే మూడు నుంచి ఐదు శాతం భూమిని హెచ్‌ఎండీఏకు గిఫ్ట్‌డీడ్‌ చేస్తారు. పార్కులు, రోడ్డు, మౌలిక వసతులతో సంబంధం లేకుండా ఈ భూమిని హెచ్‌ఎండీఏ పేరున యజమాని రిజిస్టర్‌ చేస్తారు. ఈ భూమిని అమ్ముకునే అధికారం హెచ్‌ఎండీఏకు ఉంది. గతంలో భూములకు తక్కువ రేటు ఉండటంతో చాలా మంది భూములను గిఫ్ట్‌ డీడ్‌ చేసేందుకు సుముఖత చూపారు. ఇప్పుడు ఆ భూములే హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం సమకూర్చబోతున్నాయ’ని ప్లానింగ్‌ విభాగ అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉప్పల్‌ భగాయత్, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు విక్రయిస్తే రూ.వెయ్యి కోట్ట వరకు హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఔటర్‌ నిర్వాసితులకు గిఫ్ట్‌డీడ్‌ భూములు..
ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములిచ్చిన వందలాది మంది రైతులకు భూమికి భూమిని హెచ్‌ఎండీఏ అధికారులు కేటాయించారు. కాగా, 27 మంది రైతులకు భూములిస్తామంటే ఎక్కడ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ఆయా రైతులకు దాదాపు 27 వేల గజాలను శ్రీనగర్‌లోని లే అవుట్‌లలో ఉన్న గిఫ్ట్‌డీడ్‌ భూములను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.    

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top