
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్‌లో ముఖ్యంగా లార్జ్‌స్క్రీన్ థియేటర్‌లో సీట్ల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉందంటూ అందిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. చట్ట నిబంధనల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, పురపాలక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ, జిల్లా కలెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారితో పాటు ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లోని లార్జ్‌స్క్రీన్ థియేటర్‌లో 14 వరుసల్లో 630 సీట్లు ఉన్నాయని, సీట్ల మధ్య నుంచి బయటకొచ్చే వెసులుబాటు ఎక్కడా లేదని, ఇది అత్యవసర సమయాల్లో అనేక ప్రమాదాలకు దారి తీస్తుందంటూ సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు.