బడ్జెట్ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలకోసారి నాలుగు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం నిధుల్లో 25 శాతం ఏప్రిల్‌లో, రెండో విడతలో మరో 25 శాతం నిధులను జూలైలో విడుదల చేయనున్నారు. మూడో విడత నిధులు అక్టోబరులో విడుదల చేయనున్నారు. అయితే మొదటి విడత నిధులు ఆగస్టు నెలాఖరులోగా 90 శాతం ఖర్చు చేస్తేనే మూడో విడత కింద విడుదల చేయనున్నట్లు కొత్త నిబంధన విధించారు.
నవంబర్ ఆఖరుకు తొలి రెండు విడతల్లోని నిధులు 90 శాతం వినియోగించిన విభాగాలకు మాత్రమే నాలుగో విడత నిధులు కేటాయించనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాకే బీఆర్‌వోలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. గతేడాది కేంద్ర పథకాలకు సంబంధించి వివిధ శాఖలకు విడుదలైన నిధులు వాస్తవ కేటాయింపులకు మించి అదనంగా ఉన్నట్లయితే వాటిని 2016-17 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర కోటాగా పరిగణించి సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్‌ఏల పారితోషికంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను మూడు నెలలకోసారి చెల్లించనున్నట్లు పేర్కొంది.