 
															దారి చూపుతున్న దార్శనికత
సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారీగా పెట్టుబడులు రావాలి.. పరిశ్రమల ఏర్పాటుకు మంచి రహదారులు ఉండాలి..
	- రోడ్ నెట్‌వర్క్‌లో తెలంగాణను దేశంలోనే ఉన్నతంగా నిలిపేలా ప్రభుత్వ ప్రణాళికలు
	- రూ.11 వేల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
	 
	 సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారీగా పెట్టుబడులు రావాలి.. పరిశ్రమల ఏర్పాటుకు మంచి రహదారులు ఉండాలి.. అందుకే కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రాధాన్యం ఇచ్చిన అంశాల్లో రహదారులూ ఒకటి! ఐదేళ్ల కాలంలో రోడ్ నెట్‌వర్క్‌లో తె లంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.11 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం, పాత రహదారులు అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళికకు కార్యరూపం ఇచ్చింది.
	 
	 పాత విధానాలకు చెల్లు..
	 రోడ్ల నిర్మాణంలో పాత విధానాలకు చరమగీతం పాడుతూ సీఎం కేసీఆర్.. సాహసోపేత ముందడుగు వేశారు. దేశం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే రహదారులు ఉన్నతంగా ఉండాలని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించిన చైనా ప్రభుత్వం నలుదిశలా విశాలమైన దారులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది. అందుకు దాదాపు రెండు జాతీయ బడ్జెట్‌లలో సింహభాగం నిధులను కేటాయించింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. సాధారణంగా పాత రోడ్లను మెరుగుపరచటంతోపాటు దశలవారీగా కొత్త రోడ్లను నిర్మించడం.. ఇప్పటివరకు జరుగుతోంది. కానీ ఇలా కాదని.. ఒకేసారి రాష్ట్రం మొత్తం విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి.
	
	 సింగిల్ రోడ్లు రెండు వరుసలుగా..
	 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ రోడ్లను రెండు వరుసలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3,016 కిలోమీటర్ల రోడ్లను రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తోంది. అందుకు రూ.3,953 కోట్లు కేటాయించింది. మొత్తం 258 పనులుగా వీటిని కొనసాగిస్తోంది. ఇందులో ఇప్పటికే 1,543 కిలోమీటర్ల నిడివితో 158 పనులను రూ.1,987 కోట్లతో చేపట్టింది. ఇందులో 97 కి.మీ. నిడివి గల 19 పనులు పూర్తయ్యాయి.
	
	 మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లు
	 ప్రస్తుతం చాలా మండల కేంద్రాల్లో సరైన రోడ్లు లేవు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. అన్ని మండల కేంద్రాల్లో రెండు వరుసల రోడ్లు ఉండాలని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వాటిని అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 1,970 కిలోమీటర్ల నిడివితో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ.2,571 కోట్లు కేటాయించారు.
	
	 వంతెనలే వంతెనలు
	 నదులైనా, వాగులైనా వంతెనలుంటేనే రవాణా సాగుతుంది. ఎప్పుడో నిర్మించి శిథిలమై ఎప్పుడు కూలుతాయో తెలియని వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించటంతోపాటు వంతెనలు లేనిచోట కొత్తవి నిర్మించాలని సీఎం ఆదేశించారు. దీంతో సర్వే చేసిన రోడ్లు భవనాల శాఖ అధికారులు 358 వంతెనలు అవసరమని లెక్క తేల్చటంతో ప్రభుత్వం వాటికోసం రూ.1,718 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రస్తుతం రూ.942 కోట్లతో 208 వంతెనల పనులు చేపట్టారు. ఇప్పటికి 10 వంతెనలు సిద్ధమయ్యాయి. ఈ మూడు రకాల పనులతోపాటు కేంద్రం ఇచ్చిన రూ.615 కోట్ల సీఆర్‌ఎఫ్ నిధులతో 58 పనులు చేపట్టింది ప్రభుత్వం. రూ.387 కోట్ల నాబార్డు నిధులతో 429 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
	
	 కొత్తగా 1,950 కి.మీ. జాతీయ రహదారులు
	 జాతీయ రహదారుల విషయంలో ఇప్పటి వరకు తెలంగాణపై చిన్నచూపు చూస్తున్న కేంద్రాన్ని ఒప్పించటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నది సాధించారు. జాతీయ రహదారుల విషయంలో పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడిన తెలంగాణను గౌరవప్రదమైన స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషి ఫలించింది. తెలంగాణకు కొత్తగా దాదాపు 1,950 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. వీటికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
	 
	 ప్రభుత్వం అనుకున్నట్టు పనులు సాగితే..
	► కేవలం 3 గంటల్లో హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకోవచ్చు
	► హైదరాబాద్ నుంచి ఏ జిల్లా కేంద్రానికైనా గరిష్టంగా 2 గంటల్లో చేరుకోవచ్చు
	► ఊపు ఇలాగే సాగితే మూడేళ్లలో రాష్ట్ర పురోగతి గుజరాత్‌ను మించే అవకాశం ఉంటుంది
	 
	 జాతీయ రహదారులుగా మారే రాష్ట్ర రహదారులివే...
	► హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్స్‌వాడ-బోధన్, బాసర-భైంసా-జాతీయ రహదారి 61 (పాత జాతీయ రహదారి 222)తో అనుసంధానం. - నిడివి: 230 కిలోమీటర్లు
	► హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడ-కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు. - నిడివి:133 కిలోమీటర్లు
	► కోదాడ- మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల - నిడివి: 220 కిలోమీటర్లు
	► నిర్మల్ నుంచి జగిత్యాల వరకు, వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ నుంచి ఎన్‌హెచ్ 61, ఎన్‌హెచ్63లతో అనుసంధానం. - నిడివి:110 కిలోమీటర్లు
	► అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట. -నిడివి: 160 కిలోమీటర్లు
	► కరీంనగర్ నుంచి సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు - నిడివి: 165 కిలోమీటర్లు
	► ఖమ్మం జిల్లా సారపాక నుంచి వరంగల్ జిల్లా ఏటూరునాగారం మీదుగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మీదుగా సిర్పూర్‌కాగజ్ నగర్‌కు సమీపం వరకు అభివృద్ది. -నిడివి: 475 కిలోమీటర్లు
	► హైదరాబాద్-మెదక్-బోధన్ (175 కి.మీ.)
	►సారపాక-మణుగూరు-ఏటూరు నాగారం రహదారి (104 కి.మీ.)
	► కరీంనగర్ జిల్లా సిరిసిల్ల-సిద్దిపేట-జనగామ-సూర్యాపేట మార్గంలో సూర్యాపేట నుంచి అవరపల్లి వరకు  రహదారి (33 కి.మీ.)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
