
మొహం చాటేశాడు
ఎనిమిదేళ్లుగా ప్రేమించి, ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవడమేగాక, సహజీవనం చేసి మోజు తీరాక మొహం
►ప్రియుని ఇంటి ముందు యువతి ధర్నా
►నిందితుడు టీఆర్‌ఎస్ నాయకుడు
చిలకలగూడ: ఎనిమిదేళ్లుగా ప్రేమించి, ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవడమేగాక, సహజీవనం చేసి మోజు తీరాక మొహం చాటేశాడని ఓ యువతి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన మహేశ్వరి, అదే ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు మద్దెల శ్రీకాంత్ (31)తో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2011 మే 2న వారు ఓ ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులు సహజీవనం చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని మహేశ్వరి గత రెండేళ్లుగా శ్రీకాంత్‌పై ఒత్తిడి తేగా, తన అన్న పెళ్లి అయినవెంటనే చేసుకుంటానని నమ్మించాడు.
ఇటీవల అతని అన్న వివాహం జరగడంతో మరోమారు మహేశ్వరి పెళ్లి విషయం ప్రస్తావనకు తెచ్చింది. దీంతో అతను నిన్ను పెళ్లి చేసుకోవడం మా అమ్మకు అస్సలు ఇష్టం లేదని, తన మరదలిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడమేగాక మెట్టుగూడలోని శ్రీకాంత్ ఇంటిముందు ధర్నా చేపట్టింది. ఆమెకు మద్దతుగా పలు మహిళా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. తక్షణమే పెద్దల సమక్షంలో మహేశ్వరిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు శ్రీకాంత్‌తోపాటు అతని కుటుంబసభ్యులు ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. శ్రీకాంత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.