
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు..
వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టు తీర్పిచ్చింది.
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్సాగర్ లోనే నిమజ్జనాలు చేసుకోవచ్చని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించింది. వచ్చే ఏడాది నుంచి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. వినాయక నిమజ్జనాలు ఇక నుంచి ఇందిరాపార్కులో చేస్తామని, అందులో భారీ చెరువు నిర్మిస్తామని పేర్కొన్న విషయం విదితమే. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. తాజాగా హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది గణనాథుల నిమజ్జనం హుస్సేన్సాగర్ లోనే నిర్వహించనున్నారు.