breaking news
Ganapati statues
-
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు..
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్‌సాగర్ లోనే నిమజ్జనాలు చేసుకోవచ్చని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించింది. వచ్చే ఏడాది నుంచి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. వినాయక నిమజ్జనాలు ఇక నుంచి ఇందిరాపార్కులో చేస్తామని, అందులో భారీ చెరువు నిర్మిస్తామని పేర్కొన్న విషయం విదితమే. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. తాజాగా హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది గణనాథుల నిమజ్జనం హుస్సేన్‌సాగర్ లోనే నిర్వహించనున్నారు. -
వినాయకుడి విగ్రహాల ధరలూ రెట్టింపు
సాక్షి, ముంబై: ధరల పెరుగుదల ప్రభావం వినాయకుడిపైనా పడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు అన్ని వ స్తువుల ధరలు దాదాపు మూడురెట్లు ధరలు పెరిగిపోయాయి. దీంతో సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల ఆర్థిక వ్యవహారాలు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే గణేశ్ విగ్రహాల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఈ మండళ్లకు వివిధ వాణిజ్య, రాజకీయ పార్టీల ప్రకటనల బ్యానర్లు, ప్లెక్సీలు, ప్రవేశద్వారాలతో వచ్చే ఆదాయమే ప్రధాన వనరని చెప్పవచ్చు. అయితే బీఎంసీ వీటి ఏర్పాటుపై కూడా అనేక ఆంక్షలు విధించడంతో ఆదాయానికి భారీగా గండిపడింది. దీనికి తోడు మండపం, అలంకరణ సామగ్రి ధరలు మండిపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహించాలో తెలియడం లేదంటూ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అలంకరణ, మండపం నిర్మించే పనులకు చాలా మంది కూలీలు అవసరమవుతారు. భారీ మండపాలైతే కనీసం వారం, పది రోజులు పడుతుంది. వేదికతోపాటు టెంట్లు, నేలపై పరిచే తివాచీలు, షామియానాలు, లౌడ్ స్పీకర్లు, కరెంటు బల్బులు ఇలా అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగిపోయాయి. వస్తుసామగ్రి ధరలు ఏటా రూ.5-10 వేల వరకు పెరుగుతాయనే అంచనాతో సార్వజనిక మండళ్ల నిర్వాహకులు పనులు ప్రారంభిస్తారు. కాని ఈసారి ధరలు ఏకంగా రూ.45-50 వేల వరకు పెరిగిపోయాయి. స్థానిక ప్రజలు, సొసైటీలు, దుకాణాల నుంచి చందాల రూపంలో సేకరించిన విరాళాలు ఎటూ సరిపోవడం లేదు. దీంతో మండళ్లు ప్రకటనలు లేదా స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తల దాతృత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. వీళ్లు సాయం చేయకుంటే ఉత్సవాలు సాదాసీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. గత సంవత్సరం ఒక్కో వెదురు బొంగుకు రోజుకు రూ.10-12 వరకు అద్దె ఉండగా, ఈ ఏడు రూ.20-22 దాకా చెల్లించాల్సి వస్తోంది. అలాగే కర్ర దుంగల అద్దె గత ఏడాది రూ.100-125 వరకు ఉండగా, ఈ ఏడు రూ.200-220 వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే కూలీలకు గత సంవత్సరం రోజుకు రూ.200-300 చొప్పున చెల్లించగా ఈ ఏడు రూ.450-500 దాకా చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా 10/12 అడుగుల మండపం నిర్మించాలంటే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఈ ఏడు సార్వజనిక మండళ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షల దాకా చెల్లించాల్సి వస్తోంది. దాతలు భారీగా విరాళాలు ఇస్తేనే భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం సాధ్యపడుతుందని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.