వినాయకుడి విగ్రహాల ధరలూ రెట్టింపు | Ganapati statues rates hike in Maharashtra | Sakshi
Sakshi News home page

వినాయకుడి విగ్రహాల ధరలూ రెట్టింపు

Aug 20 2013 12:08 AM | Updated on Oct 8 2018 5:45 PM

ధరల పెరుగుదల ప్రభావం వినాయకుడిపైనా పడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు అన్ని వ స్తువుల ధరలు దాదాపు మూడురెట్లు ధరలు పెరిగిపోయాయి.

సాక్షి, ముంబై: ధరల పెరుగుదల ప్రభావం వినాయకుడిపైనా పడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు అన్ని వ స్తువుల ధరలు దాదాపు మూడురెట్లు ధరలు పెరిగిపోయాయి. దీంతో సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల ఆర్థిక వ్యవహారాలు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే గణేశ్ విగ్రహాల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యాయి.  ఈ మండళ్లకు వివిధ వాణిజ్య, రాజకీయ పార్టీల ప్రకటనల బ్యానర్లు, ప్లెక్సీలు, ప్రవేశద్వారాలతో వచ్చే ఆదాయమే ప్రధాన వనరని చెప్పవచ్చు. అయితే బీఎంసీ వీటి ఏర్పాటుపై కూడా అనేక ఆంక్షలు విధించడంతో ఆదాయానికి భారీగా గండిపడింది.
 
 దీనికి తోడు మండపం, అలంకరణ సామగ్రి ధరలు మండిపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహించాలో తెలియడం లేదంటూ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అలంకరణ, మండపం నిర్మించే పనులకు చాలా మంది కూలీలు అవసరమవుతారు. భారీ మండపాలైతే కనీసం వారం, పది రోజులు పడుతుంది. వేదికతోపాటు టెంట్లు, నేలపై పరిచే తివాచీలు, షామియానాలు, లౌడ్ స్పీకర్లు, కరెంటు బల్బులు ఇలా అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగిపోయాయి. వస్తుసామగ్రి ధరలు ఏటా రూ.5-10 వేల వరకు పెరుగుతాయనే అంచనాతో సార్వజనిక మండళ్ల నిర్వాహకులు పనులు ప్రారంభిస్తారు. కాని ఈసారి ధరలు ఏకంగా రూ.45-50 వేల వరకు పెరిగిపోయాయి. స్థానిక ప్రజలు, సొసైటీలు, దుకాణాల నుంచి చందాల రూపంలో సేకరించిన విరాళాలు ఎటూ సరిపోవడం లేదు. దీంతో మండళ్లు ప్రకటనలు లేదా స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తల దాతృత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. వీళ్లు సాయం చేయకుంటే ఉత్సవాలు సాదాసీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
 
 గత సంవత్సరం ఒక్కో వెదురు బొంగుకు రోజుకు రూ.10-12 వరకు అద్దె ఉండగా, ఈ ఏడు రూ.20-22 దాకా చెల్లించాల్సి వస్తోంది. అలాగే కర్ర దుంగల అద్దె గత ఏడాది రూ.100-125 వరకు ఉండగా, ఈ ఏడు రూ.200-220 వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే కూలీలకు గత సంవత్సరం రోజుకు రూ.200-300 చొప్పున చెల్లించగా ఈ ఏడు రూ.450-500 దాకా చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా 10/12 అడుగుల మండపం నిర్మించాలంటే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఈ ఏడు సార్వజనిక మండళ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షల దాకా చెల్లించాల్సి వస్తోంది. దాతలు భారీగా విరాళాలు ఇస్తేనే భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం సాధ్యపడుతుందని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement