
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనానికి పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకే దర్శనాలు నిలిపివేయడంతో శుక్రవారం ఉదయం నుంచే షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాగణపతి దర్శనం సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులను ఆపివేశారు. ఆ తరువాత షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల దాటగానే అనంత చతుర్ధశిలో కలశాన్ని కదిలించి, ఆ తరువాత మహాగణపతిని వాహనంపైకి ఎక్కిస్తా రు. ఇరువైపులా ఉన్న విగ్రహాలను కూడా మరో వా హనంపై ఉంచి శనివారం ఉదయం 6.30 గంటలకు శోభాయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం 1.30 కల్లా నిమజ్జనం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.
మహాగణపతి కోసం భారీ వాహనం..
50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న మహాగణపతిని సాగర తీరానికి తీసుకెళ్లేందుకు ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన భారీ ట్రాయిలర్ వాహనం సిద్ధం చేశారు. 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 26 టైర్లు ఉన్న వాహనం బరువు 28 టన్నులు. ఈ వాహనం 100 టన్నుల బరువును మోస్తుంది.
రథసార«థి మందాటి వెంకట్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని సాగర తీరానికి చేర్చేందుకు రథసారధిగా ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లాకు చెందిన మందాటి వెంకట్‌రెడ్డి వచ్చాడు. గతంలో వెంకట్‌రెడ్డి 2015, 2017, 2022లో మహాగణపతిని నిమజ్జనానికి నిర్విఘ్నంగా తరలించాడు. ఈ సంవత్సరం మరోసారి ఆయనకు అవకాశం దక్కింది.
రూట్ మ్యాప్
ఖైరతాబాద్ నుంచి మొదలై రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి ప్‌లై ఓవర్, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకుంటుంది. మహాగణపతిని ఖైరతాబాద్ మంటపం వద్ద అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞానంతో రూపొందిన క్రేన్ సాయంతో వాహనంపైకి తరలిస్తారు. నిమజ్జన సమయంలో హైడ్రాలిక్ భారీ సూపర్ క్రేన్ సాయంతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సొంత వాహనాలొద్దు...
హుస్సేన్‌సాగర్ వద్ద సామూహిక నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులు సొంత వాహనాల్లో కాకుండా సిటీ బస్సులు, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటి ప్రజారవాణా వ్యవస్థల్ని వినియోగించాలి. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ మార్గంలో ఇటు నుంచి అటు వెళ్లడానికి కేవలం రాజేష్ మెడికల్ హాల్, బషీర్‌బాగ్ చౌరస్తాల వద్దే అవకాశం ఉంది. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వాళ్లు ఓఆర్‌ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే వాడుకోవాలి. ట్రాఫిక్‌కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 8712660600, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు.
– జోయల్ డెవిస్, సిటీ ట్రాఫిక్ చీఫ్