
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ మరోసారి భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
మంగళవారం రాత్రి నుంచే జంట నగరాల్లోని చాలాచోట్ల చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. మధ్యాహ్నాం లేదంటే సాయంత్రానికి ఇది భారీ నుంచి అతి భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ తరుణంలో.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఇవ్వమని కంపెనీలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోం అంశాన్ని పరిశీలించాలని కోరారు. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆఫీసులకు వచ్చిపోయేవాళ్లు తమ ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇంకోవైపు.. కరెంట్ పోల్స్, మ్యాన్‌హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తున్నారు.
ఇంకోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ప్రస్తుత నీటి మట్టం 513.34 మీటర్లతో ఫుల్‌ట్యాంక్ లెవల్‌కు చేరింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.