నిరాశ..
గ్రేటర్ పరిధిలో 2007 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం...
	వృథాగా మారిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు
	నాలుగేళ్లుగా కేటాయింపులు పెండింగ్
	15,500 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు
	మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల మధ్య వివాదం
	{పభుత్వం చొరవ చూపాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
	 
	సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో 2007 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్  హయాంలో కేంద్ర ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 50 వేల ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో హైదరాబాద్ జిల్లాకు 15 వేలు, రంగారెడ్డి జిల్లాకు 35 వేలు కేటాయించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.2.60 లక్షల నుంచి రూ 3 లక్షలు ఖర్చు కాగా,  కేంద్ర ప్రభుత్వం వాటాగా  50 శాతం నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం(రూ.26 వేలు), మిగతా 30 శాతం నిధులు బ్యాంకుల నుంచి జీహెచ్‌ఎంసీ రుణం రూపేణా  ఇప్పించాల్సి ఉంటుందని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథక రూపకల్పనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో కుందన్‌బాగ్, కుర్మలగూడ, మాల్లాపూర్, కర్మన్‌ఘాట్, జవహర్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ఎనిమిది ప్రాంతాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బహు ళ అంతస్తులతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అదేవిధంగా నగరంలో ఇళ్లు లేని నిరుపేదల నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు జీహెచ్‌ఎంసీ స్వీకరించింది. ఇళ్ల సంఖ్యకు సరిపడ 50 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారయంత్రాంగం దశల వారిగా 2010 వరకు సజావుగా 35 వేల మందికి  బహుళ అంతస్తుల్లోని ఇళ్లు కేటాయించారు. ఆ తర్వాత వీటిపై దృష్టి సారించలేదు. దీంతో 15,500 ఇళ్లు ఎవరికీ కేటాయించకుండానే పెండింగ్‌లో పెట్టారు. దీంతో తమ వాటాగా రూ.26వేలు చెల్లించిన దా దాపు 15,500 మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
	 
	కారణాలివే...
	వైఎస్ మరణానంతరం వరుసగా ముఖ్యమంత్రులు మారటంతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో ఆ ఇళ్ల జోలికి అప్పటి ప్రభుత్వం గాని, అధికారులు గాని వెళ్లలేదు. దీంతో అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పాటు ఎన్నికల హామీల్లో భాగంగా గ్రేటర్‌లో  డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల  నిర్మాణానికి చర్యలు చేపట్టింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలోని  లబ్ధిదారులతో సహా వేల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. మరో వైపు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో 10 శాతం వాటా చెల్లించి ఇళ్లు పొందని లబ్ధిదారులు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవటంతోపాటు... కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గతంలో నిర్మించిన ఇళ్లను కేటాయించినా తీసుకుంటామని పేర్కొంటున్నారు. 15,500 ఇళ్లలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లబ్ధిదారులు 7,500 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు 8 వేల మంది ఉన్నారు.  అయితే....పాలకులు మారటంతోపాటు ప్రజాప్రతినిధులు మారటం వల్ల రంగారెడ్డి జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న 8 వేల మంది లబ్ధిదారుల జాబితాపై  మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధుల మధ్య వివాదం కొనసాగుతున్నది.
	
	గతంలోగుర్తించిన లబ్ధిదారులకే ఈ ఇళ్లు కేటాయించాలని  మాజీ ప్రజాప్రతినిధులు పట్టుపడుతుండగా, తామిచ్చిన జాబితాకు అనుగుణంగానే ఇళ్లు ఇవ్వాలని ప్రస్తుత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  నాలుగేళ్లుగా నానుతున్న ఈ ఇళ్ల కేటాయింపు సమస్యపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దష్టి సారిస్తే తప్ప పరిష్కారం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ విషయంలో మునిసిపల్ మంత్రి కేటీఆర్ చొరవ చూపరరాలని లబ్ధిదారులు  కోరుతున్నారు. ఈ పెండింగ్ సమస్యకు మోక్షం లభిస్తే...గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల డిమాండ్‌పైర కూడా కొంత భారం తగ్గగలదని పేర్కొంటున్నారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
