
విదేశీయుడి వీరంగం
నకిలీ డాలర్లు, యూరోలు చెలామణి చేసేందుకు వచ్చిన ఓ విదేశీయుడు వీరంగం సృష్టించాడు. తనను పట్టుకోబోయిన ముత్తూట్...
- నకిలీ డాలర్లు, యూరోలు మార్చేందుకు యత్నం
- పట్టుకున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ సిబ్బంది, పోలీసులపై దాడి
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: నకిలీ డాలర్లు, యూరోలు చెలామణి చేసేందుకు వచ్చిన ఓ విదేశీయుడు వీరంగం సృష్టించాడు. తనను పట్టుకోబోయిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ సిబ్బందితో పాటు పోలీసులపైన దాడిచేసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. సౌత్‌ఆఫ్రికాకు చెందిన బర్రీ జాన్సన్(33) వ్యాపారం నిమిత్తం గత డిసెంబర్ 22న భారత్‌కు వచ్చాడు.
శుక్రవారం ఇతను సుల్తాన్‌బజార్ ఠాణా పక్కనే ఉన్న ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో రూ. 21,245 విలువగల 350 యూఎస్ డాలర్లు, రూ. 29,120 విలువైన 350 యూరోపియన్ యూరోలు మార్పిడికి ఇచ్చాడు. వాటిని పరిశీలించిన ఫిన్‌కార్ప్ సిబ్బంది నకిలీవిగా గుర్తించారు. అయితే, ఇది గమనించిన జాన్సన్ వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చి వీరంగం సృష్టించాడు. సిబ్బందిపై ముష్టిఘాతాలు కురిపించి తప్పించుకొనేందుకు యత్నించాడు. దీంతో ఫిన్‌కార్ప్ సిబ్బంది డోర్లు మూసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులపై దాడి ...
జాన్సన్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువస్తుండగా... తప్పించుకొనేందుకు యత్నించి 15 మంది పోలీసులపై దాడి చేశాడు. జమేదార్ రామ్‌చందర్‌రెడ్డి, ఎస్‌ఐలు మహేశ్‌గౌడ్, రామ్‌కృష్ణారెడ్డి, ఇతర కానిస్టేబుల్‌లపై ముష్టిఘాతాలు కురిపించి, తన్నాడు. అడ్డుకోబోయిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌పై కూడా దాడి చేశాడు. పోలీసులంతా కలిసి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఫేక్‌నోట్లు చెలామణి చేసిన విదేశీయులు...
గతనెలలో సుల్తాన్‌బజార్ ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో ఓ విదేశీయుడు 20 వేల విలువైన నకిలీ యూరోస్ తీసుకువచ్చి మార్చాడని ముత్తూట్ బ్రాంచి మేనేజర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కాచిగూడ నింబోలిఅడ్డాలో విదేశీయులు మోసానికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో తమ సిబ్బంది జాన్సన్ తెచ్చిన దొంగనోట్లను క్షణ్ణంగా పరిశీలించగా నకిలీవని తేలిందన్నారు.
బాత్‌రూంలోనే డ్రగ్స్ తీసుకున్న నిందితుడు...
తాను దొరికిపోయినట్లు గమనించిన విదేశీయుడు బాత్‌రూంకని వెళ్లి డ్రగ్స్ తీసుకుని వీరంగం సృష్టించాడని ముత్తూట్ ఫిన్‌కార్ప్ బ్రాంచి మేనేజర్ తెలిపారు. అప్పటివరకు బాగానే ఉన్న అతను పూనకం వచ్చినట్లు ఊగూతూ తమపైన, పోలీసులపైన దాడి చేశాడని తెలిపారు. కాగా, నిందితుడి వద్ద నుంచి 12 నకిలీ డాలర్లు, యూరోలు నోట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై 332, 420, 489 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.