ఖాతాలో వద్దు.. చెక్‌ ముద్దు | farmers wants amount in Cheques only | Sakshi
Sakshi News home page

ఖాతాలో వద్దు.. చెక్‌ ముద్దు

Dec 28 2017 3:21 AM | Updated on Oct 1 2018 2:16 PM

farmers wants amount in Cheques only - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
రైతులకు పెట్టుబడి పథకం కింద అందించే సొమ్మును చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు ఇవ్వనుంది. దీంతో అక్రమార్కులు చొరబడకుండా ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు పెట్టుబడి సొమ్ము ఎలా అందజేయాలన్న అంశంపై సీఎం కార్యాలయం రెండ్రోజుల కింద వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించింది. ఇందులో రెండు మూడు రకాల సలహాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున ఒక్కో సీజన్‌కు రూ.1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క పైసా కూడా పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో సీఎం కార్యాలయం కసరత్తు చేసినట్లు సమాచారం.

చెక్‌ల వైపే మొగ్గు ఎందుకంటే..?
పెట్టుబడి సొమ్మును నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతులు పంట రుణాలు తీసుకుంటారు. అయితే అనేక కారణాలతో వాటిని చెల్లించనివారు అనేక మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేస్తే బ్యాంకులు వాటిని బకాయిల కింద జమ చేసుకుంటాయి. దీనివల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదు సరికదా లక్ష్యం కూడా నెరవేరకుండా పోతుందని, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న చర్చ జరిగింది.  ఇక నేరుగా నగదు ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చించారు. కానీ ఇది అక్రమార్కులకు వరంగా మారుతుందని గత అనుభవాల ప్రకారం అంచనా వేశారు.  

చివరికి రైతుకు చెక్కుల ద్వారానే పెట్టుబడి సొమ్ము పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది కూడా బ్యాంకుతో ముడిపడిన అంశమే అయినా.. రైతు ఖాతాలో వేయకుండా నేరుగా చెక్‌ను క్లియర్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తారని తెలిసింది. కరువు కాటకాల సమయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సొమ్మును ఇలాగే ఇస్తారు. స్థానిక ఎమ్మార్వో ఖాతా ద్వారా రైతులు తీసుకునే ఏర్పా టు చేస్తారు. అందుకు రైతు పేరిటే చెక్‌ జారీ చేస్తారు. ఆ చెక్‌లను రైతు తన ఆధార్‌ కార్డు లేదా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో చూపిస్తే నేరుగా రూ.4 వేలు ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా రూ.20 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వీలుందని ఎస్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చెక్కుల్లోనూ అవకతవకలు జరగకుండా వాటిని గ్రామసభల్లో రైతులకు పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement