డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు చేయాలని ఉన్నత విద్యా శాఖ నిర్ణయించింది.
ఓయూ పరిధిలోనూ ప్రవేశాలకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు చేయాలని ఉన్నత విద్యా శాఖ నిర్ణయించింది. జూన్ 6 వరకు ఆలస్య రుసుము లేకుండా, అలాగే 8వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం ఉండగా, దాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రస్తుతం జరుగుతుండటం, ఆ పరీక్షలకు హాజరయ్యే 5.5 లక్షల మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది డిగ్రీ కోర్సుల్లోనే చేరేవారు ఉండటం, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ప్రవేశాల షెడ్యూలును మార్పు చేయాలని నిర్ణయించింది.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు ఆగాలని, ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయ్యే వరకు డిగ్రీలో చేరే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఒకటీ రెండు రోజుల్లో మార్పు చేసిన షెడ్యూలు ప్రకటించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా కొన్ని కాలేజీల యాజమాన్యాలువిద్యార్థులతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్ చేసినట్లు వచ్చిన కథనాలపై కడియం శ్రీహరి విచారణకు ఆదేశించారు.