డీడీ ఎక్కడండి.. ఎక్కడో పోయిందండి!

DDs disappear in the Archaeological Department - Sakshi

పురావస్తు శాఖలో డీడీలు మాయం

కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణ

సాక్షి, హైదరాబాద్‌: పురావస్తు శాఖలో పెద్ద సంఖ్యలో డిమాండ్‌ డ్రాఫ్టులు గల్లంతయ్యాయి. అవి ఏ పని కోసం సంబంధించినవో వివరించే కొన్ని ఫైళ్లు కూడా మాయమయ్యాయి. అందులో కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లు వారి డీడీల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం నుంచి పురావస్తు శాఖకు భారీ మొత్తాన్ని కేటాయించింది.

ఆ శాఖ పరిధిలోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని ఖర్చు చేయాలి. దాదాపు రూ.70 కోట్ల వరకు ఈ రూపంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టారు. పనుల టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) దాఖలు చేయాల్సి ఉంటుంది. దీన్ని డీడీ, చెక్కులు, బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లిస్తారు. ఆ పని విలువలో రెండున్నరశాతం వరకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మాత్రం నిర్ధారిత కాలం తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇలా 12, 13వ ఆర్థిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన టెండర్లతో పాటు కాంట్రాక్టర్లు ఈఎండీని డీడీల రూపంలో చెల్లించారు. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. 

బ్యాంకులో వేయక ఏం చేసినట్లు.. 
సాధారణంగా ఈఎండీ తాలూకు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఆయా శాఖలు ఖర్చు చేసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు నిర్ధారిత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. కానీ పురావస్తు శాఖలో మాత్రం ఆ ఈఎండీ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయలేదని తెలుస్తోంది. ఆ డీడీలను అలాగే ఫైళ్లలో ఉంచేశారని, ఇప్పుడు ఆ ఫైళ్లతో పాటు అవి కనిపించటం లేదని తెలుస్తోంది. పనులు పూర్తి కావటంతో కాంట్రాక్టర్లు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.

అప్పుడు కాని గల్లంతైన సంగతిని గుర్తించలేదు. ఈ డీడీల విలువ ఎంతో కూడా తెలియకుండా అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించాలని తెలంగాణ, ఆంధ్ర పురావస్తు కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి పెరుగుతుండటంతో ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘ఈ ఫైళ్లను మాకు ఇవ్వలేదు, అవి తెలంగాణ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదు’అని ఏపీకి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top